పట్టుబడిన 10 వేల వాహనాలు వేలం.. సర్కార్ కు రూ.6 కోట్ల ఆదాయం

పట్టుబడిన 10 వేల వాహనాలు వేలం.. సర్కార్ కు రూ.6 కోట్ల ఆదాయం

ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పాడుబడిన, క్లెయిమ్ చేయని వాహనాలను వేలం వేయగా..దీని ద్వారా రూ. 6 కోట్ల వరకు సైబరాబాద్ పోలీస్ శాఖ సంపాదించింది.  ఇప్పటి వరకు 10 దశల్లో వేలం నిర్వహించామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. మొత్తం 9,627 వాహనాలను వేలం వేయగా.. దీని ద్వారా రూ.6 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు ఆయన వెల్లడించారు. వీటిలో 4,702 వాహనాలకు సంబంధించి గతంలో ఎనిమిది ప్రకటన నోటీసులు విడుదల చేశామన్న సీపీ.. నిర్ణీత గడువులోగా తమ వాహనాలను క్లెయిమ్ చేసుకునేలా యజమానులను అప్రమత్తం చేశామన్నారు. 

హైదరాబాద్ లో వివిధ పోలీస్ స్టేషన్లలో  మరో 6 వేలకు పైగా వాహనాలు పరిష్కారం కోసం వేచి ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వీటికి కూడా త్వరలో వేలం నిర్వహిస్తామన్నారు. ఈ వాహనాలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు పొందుపరిచామని తెలిపారు. అభ్యంతరాలు ఉన్న యజమానులు 6 నెలల కాల పరిమితిలోపు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.