జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్(గోల్కొండ టీమ్), మాసబ్ ట్యాంక్ పోలీసులు దాడి చేశారు. ఒకరిని అరెస్ట్‌చేసి, కల్తీ నెయ్యికి ఉపయోగిస్తున్న రూ.18 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ సిటీ అడిషనల్ డీసీపీ(టాస్క్ ఫోర్స్) శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని భోలానగర్‌లో మహమ్మద్ జునైద్ హుస్సేన్ ప్రైడ్ డెయిరీ సెంటర్పేరుతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడు. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో బుధవారం దాడి చేశారు. జునైద్హుస్సేన్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. పామాయిల్, డాల్డా, ఇతర హానికరమైన పదార్థాలను ఆవు, గేదె మీగడలో కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
ఈ నెయ్యిని అసలైన నెయ్యిగా నమ్మిస్తూ ప్రజలకు, హోటళ్లకు, ఫంక్షన్లకు విక్రయిస్తున్నట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగిస్తున్న 28 డబ్బాల (ఒక్కో డబ్బా 15 కేజీలు) రుచి గోల్డ్ డాల్డా, 2 బాయిలర్లు, పుషింగ్ మెషీన్, ప్యాకింగ్ మెషీన్, రెండు వెయింగ్మెషీన్లు, 4 గ్యాస్ సిలిండర్లు, 460 కేజీల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యితోపాటు 2,090 కేజీల ఆవు మీగడ , 1,170 కేజీల గేదె మీగడ సీజ్ చేసినట్లు అడిషనల్డీసీపీ పేర్కొన్నారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, మాసబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు విజయానంద్, చందన, సిబ్బంది పాల్గొన్నారు.
