రేపటి(జులై 16) నుంచి ఆషాఢ బోనాలు..గోల్కొండ జగదాంబికా ఆలయంలో తొలి పూజ

రేపటి(జులై 16) నుంచి ఆషాఢ బోనాలు..గోల్కొండ జగదాంబికా ఆలయంలో తొలి పూజ
  •  పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు సురేఖ, పొన్నం, స్పీకర్ ప్రసాద్‌‌‌‌‌‌‌‌కుమార్
  •     ఆగస్టు 2న లష్కర్ బోనాలు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  •     3, 9, 10 తేదీల్లో అంబారీ ఊరేగింపులు 

 

హైదరాబాద్, వెలుగు: భాగ్యనగరం ఆషాఢ మాస ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జానపద కళారూపాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించే వేడుకలకు సర్వం సిద్ధమైంది. గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరగనుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆగస్టు 2న  సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి  రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

ప్రముఖ ఆలయాల్లో పట్టువస్త్రాల సమర్పణ 

దేవాలయాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 21న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆగస్టు 9న ప్రముఖ ఆలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్‌‌‌‌‌‌‌‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భేలా ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, హరిబౌలిలోని అక్కన్న–మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మిరాలం మండి మహంకాళి ఆలయంలో గడ్డం ప్రసాద్, గౌలిపుర మహంకాళి ఆలయంలో వాకిటి శ్రీహరి, జగదాంబ ఆలయంలోని సుల్తాన్ షాహి ఆలయంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇలా 29 ప్రధాన ఆలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

కనువిందుగా అంబారీ ఊరేగింపు

బోనాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించే ఏనుగు అంబారీ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సారి కర్ణాటక నుంచి 34 ఏళ్ల వయస్సు ఉన్న లక్ష్మి అనే ఏనుగును తీసుకురానున్నారు. గతేడాది కూడా అక్కడినుంచే తీసుకొచ్చారు. ఆగస్టు 3న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 9న సబ్జీ మండి, ఆగస్టు 10న హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం నుంచి అంబారీతో భారీ ఊరేగింపులు జరగనున్నాయి.

రూ.20 కోట్లు మంజూరు

బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో రూ.15 కోట్లు ఆలయాల్లో ఏర్పాట్ల కోసం కేటాయించగా.. మిగిలిన రూ.5 కోట్లు బోనాల జాతర ప్రమోషన్ కోసం వినియోగించనున్నారు. భక్తులకు క్యూ లైన్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాల్లో లోటు రాకుండా దేవాదాయ, పోలీసు, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు శాఖ నగరం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌, భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది.