సోలార్కు గేటెడ్ కమ్యూనిటీల జై.. రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటున్న కమ్యూనిటీలు

సోలార్కు గేటెడ్ కమ్యూనిటీల జై.. రూఫ్ టాప్  సోలార్  ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటున్న కమ్యూనిటీలు
  • పీఎం సూర్యఘర్  స్కీమ్ కింద కిలో వాట్​కు రూ.18 వేలు సబ్సిడీ
  • 500 కిలోవాట్ల వరకు రాయితీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని గేటేడ్​ కమ్యూనిటీలు సోలార్​ విద్యుత్​ వైపు దృష్టి సారించాయి. కమ్యూనిటీ పరిధిలో నివసించే కుటుంబ అవసరాల కోసం ఉపయోగించే కరెంటుకు చార్జీలు ఎక్కువ​మొత్తంలో ఉంటున్నాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవడానికి కమ్యూనిటీ సంఘాల ప్రతినిధులు.. ప్రభుత్వం అందించే సబ్సిడీని ఉపయోగించుకొని తమ గేటేడ్​ కమ్యూనిటీ భవనాలపై సోలార్​ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.

పీఎం సూర్యఘర్​ స్కీమ్ లో భాగంగా రూఫ్​ టాప్​ సోలార్​ యూనిట్లను నెలకొల్పుకుంటున్నారు. ఒక కిలోవాట్ ​కు రూ.18 వేల సబ్సిడీ వస్తుండటంతో తమ కమ్యూనిటీలోని కుటుంబాల స్థాయిలను బట్టి రూఫ్​పై 500 కిలో వాట్స్​ వరకు సోలార్​  విద్యుత్  ఉత్పత్తి చేస్తున్నారు. 

ఇప్పటికే నగరంలోని 50కి పైగా గేటేడ్​ కమ్యూనిటీల్లో ఇలాంటి సోలార్  ప్యానెళ్లను ఏర్పాటు చేయగా.. మరో 200 చోట్ల సోలార్​ విద్యుత్​ తయారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న గేటేడ్​ కమ్యూనిటీ భవనాలపై సోలార్​ విద్యుత్​ ప్లాంట్ల ఏర్పాటును బిల్డర్లు ప్రోత్సహిస్తున్నారు. దీంతో హైదరాబాద్​లో ఆకాశహర్మ్యాలపై సోలార్​ ప్యానెళ్లు జిగేల్​ మంటున్నాయి.  

రూఫ్‌‌‌‌‌‌‌‌టాప్  సోలార్  అంటే ఏమిటి?

ఇంటి భవనం పైకప్పు మీద సోలార్  ప్యానెళ్లు ఏర్పాటు చేసి సూర్యకాంతిని విద్యుత్‌‌‌‌‌‌‌‌గా మార్చే వ్యవస్థనే రూఫ్ టాప్  సోలార్  అంటారు. ఇది ముఖ్యంగా గ్రిడ్ -కనెక్టెడ్ (ఆన్-గ్రిడ్) సిస్టమ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. సోలార్  నుంచి వచ్చే విద్యుత్‌‌‌‌‌‌‌‌ను నెట్ మీటరింగ్  ద్వారా ముందు ఇంట్లో వాడుకుని, మిగిలిన దానిని విద్యుత్  గ్రిడ్‌‌‌‌‌‌‌‌కు అమ్మవచ్చు. రాత్రివేళ, మేఘావృతమైనప్పుడు గ్రిడ్  నుంచి విద్యుత్  తీసుకోవచ్చు. రాష్ట్రంలో 2018 నుంచి ఈ విధానం ప్రజాదరణ పొందింది. 

ఎండలు ఎక్కువగా ఉండటంతో ఏటా300 రోజులు గ్రీన్​ ఎనర్జీ ఉత్పత్తి చేసుకొని వినియోగించుకోవచ్చు. పీఎం సూర్య ఘర్​ స్కీమ్  ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచితం. సోలార్​ విద్యుత్​ ఉత్పత్తితో దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతోంది. సోలార్​ ప్యానెళ్లకు 25, 30 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఇన్వెస్ట్​మెంట్​ 5 నుంచి 7 సంవత్సరాల్లోనే రికవరీ చేసుకోవచ్చు. మూడు కిలోవాట్ల వరకు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ అందిస్తోంది. గేటెడ్ ​ కమ్యూనిటీలలో అయితే కిలోవాట్​కు రూ.18 వేల చొప్పున 500 కిలోవాట్స్​ వరకు సబ్సిడీ లభిస్తుంది. 

రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పైగా ఖర్చు

గేటేడ్​ కమ్యూనిటీస్​ రూఫ్​టాప్​పై సోలార్​ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.కోటి నుంచి రూ.5 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇందులో స్థాయిని బట్టి ప్రభుత్వం అందించే సబ్సిడీ పోగా మిగతా డబ్బులను ఓనర్స్​ అసోసియేషన్​ ఫండింగ్, బ్యాంక్​ లోన్లు తీసుకుంటున్నారు. ఇలా నెలకు ఒక్కో కమ్యూనిటీలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కరెంట్​ బిల్లులను తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే నగరంలో మై హోమ్​ విహంగలో 500, మీనాక్షీ స్కై మంచ్​లో 200, సుమధుర ఆక్రోపోలీస్​ అపార్ట్​మెంట్స్​లో 295, క్రూజ్​ అండ్​ హైట్స్​, అశోకలో 120 చొప్పున కిలోవాట్స్​ సామర్థ్యం గల సోలార్​ పవర్​ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్​ ఉత్పత్తి చేస్తూ వినియోగిస్తున్నారు.

 నగరవ్యాప్తంగా గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, మణికొండ, వంటి ఏరియాల్లో 50కి పైగా గేటేడ్​ కమ్యూనిటీస్​లో సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేశామని టీజీ రెడ్​కో ఆఫీసర్లు చెబుతున్నారు. పీఎం సూర్యఘర్​ స్కీమ్  కింద రాష్ట్రవ్యాప్తంగా 96.45 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రూ.174 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా అందించిందని తెలిపారు.