ఆన్లైన్ గేమింగ్ ముఠా అరెస్టు..హైదరాబాద్ లో రూ.5 వేల కోట్ల సిండికేట్ గుట్టురట్టు

ఆన్లైన్ గేమింగ్ ముఠా అరెస్టు..హైదరాబాద్ లో రూ.5 వేల కోట్ల సిండికేట్ గుట్టురట్టు
  • హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో దాడులు
  • ముంబై వాసి ప్రభు కుమార్, హైదరాబాద్ వాసి రాజశేఖర్ రెడ్డే ప్రధాన సూత్రధారులు?
  • ఏండ్ల తరబడి యథేచ్ఛగా జీఎస్టీ ఎగవేత.. పక్కా ఆధారాలతో పట్టివేత
  • 5 వేల కోట్లసిండికేట్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ డీజీజీఐ

హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ ముసుగులో సాగుతున్న భారీ ఆన్‌‌లైన్ గేమింగ్ దందా గుట్టును డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) హైదరాబాద్ జోన్ అధికారులు రట్టు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. చిన్న సమాచారంతో మొదలైన విచారణ ఏకంగా రూ. 5,000 కోట్ల భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల టర్నోవర్ నడిపిస్తూ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని ఎగ్గొడుతున్న ఈ అంతర్రాష్ట్ర సిండికేట్‌‌పై హైదరాబాద్ జోన్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో హైదరాబాద్‌‌తో పాటు ఢిల్లీ, ముంబై నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ దాడులు దేశవ్యాప్తంగా కార్పొరేట్, గేమింగ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ భారీ స్కామ్‌‌ వెనుక ముంబైకి చెందిన వై.ఎస్. ప్రభు కుమార్, హైదరాబాద్‌‌కు చెందిన రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా వీరు ఆన్‌‌లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా బెట్టింగ్‌‌లు, గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వ కళ్లుగప్పి అక్రమ లావాదేవీలు జరుపుతున్నట్లు తెలిసింది. వీరు నకిలీ ఇన్వాయిస్‌‌లు సృష్టించడం, విదేశీ సర్వర్ల ద్వారా లావాదేవీలు జరపడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం. ముంబై, ఢిల్లీలో ఆఫీసులు తెరిచి, హైదరాబాద్ కేంద్రంగా ఆపరేషన్స్ నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి నెట్‌‌వర్క్ ఎంత బలంగా ఉందంటే.. అనేక షెల్ కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయలను మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.


సహకరించిన వారికీ బిగుస్తున్న ఉచ్చు.. 

సోదాల్లో లభించిన హార్డ్ డిస్క్‌‌లు, బ్యాంక్ స్టేట్‌‌మెంట్ల ఆధారంగా జీఎస్టీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేవలం పన్ను ఎగవేతే కాకుండా.. ఈ వ్యవహారంలో హవాలా కోణం కూడా ఉందా? అనే దిశగా ఆరా తీస్తున్నారు. రూ. 5,000 కోట్ల లావాదేవీల్లో ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ వాటా ఎంత? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే విషయాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుల అరెస్టుతో పాటు వారికి సహకరించిన మరికొంతమంది పేర్లు కూడా త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఆన్‌‌లైన్ గేమింగ్‌‌కు జీఎస్టీ ఎలా? 

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆన్‌‌లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్, క్యాసినోలపై పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. తాజా నిబంధనల ప్రకారం.. ఆన్‌‌లైన్ గేమ్స్‌‌లో యూజర్లు పందెం కాసే లేదా డిపాజిట్ చేసే పూర్తి మొత్తంపై 28 శాతం జీఎస్టీ చెల్లించడం తప్పనిసరి. ఉదాహర ణకు ఒక యూజర్ రూ. 1,000 పెట్టి చిప్స్ కొన్నా లేదా వాలెట్‌‌లో యాడ్ చేసినా.. ఆ మొత్తంపై కంపెనీ 28 శాతం పన్ను కట్టాలి. ఇది ‘గేమ్ ఆఫ్ స్కిల్’ అయినా, ‘గేమ్ ఆఫ్ చాన్స్’ అయినా సరే.. పన్ను వర్తిస్తుంది. కానీ ఈ ముఠా.. తమది కేవలం ప్లాట్‌‌ఫామ్ సర్వీస్ అని చెప్పుకుంటూ, లేదా విదేశీ యాప్స్ అని మభ్యపెడుతూ ఈ 28% భారీ పన్నును ఎగవేసినట్లు తెలుస్తోంది. కేవలం నామమాత్రపు పన్ను కట్టడం లేదా అసలు రిజిస్ట్రేషన్ లేకుండానే డొల్ల కంపెనీల ద్వారా వేల కోట్లు వెనకేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.