V6 News

హైడ్రా కూల్చేంత వరకూ పట్టించుకుంటలే..సర్కార్ జాగల్లో కడుతున్నా నో రెస్పాన్స్ 

హైడ్రా కూల్చేంత వరకూ పట్టించుకుంటలే..సర్కార్ జాగల్లో కడుతున్నా నో రెస్పాన్స్ 
  •   ఆక్రమణలపై  ఆఫీసర్ల సైలెన్స్​
  • ఒకచోట పర్మిషన్ ​తీసుకుని మరోచోట కడుతున్నా  లైట్​
  • ప్రశ్నిస్తే నోటీసులిచ్చామని దాటవేత  
  • అపార్ట్​మెంట్లు కట్టి అమ్ముకుంటున్న కబ్జారాయుళ్లు  
  • ఆ ఇండ్లలో ప్రజలు ఉంటుండటంతో వదిలేస్తున్న హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గం ఐలాపూర్​లో హైడ్రా ఆరంతస్తుల భారీ బిల్డింగును అక్రమమంటూ నేలమట్టం చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది. కోర్టు స్టే ఉత్తర్వులున్నా దర్జాగా బిల్డింగ్​కట్టేసుకున్నారని అధికారులు వాదిస్తుండగా, అసలు.. అంత పెద్ద బిల్డింగును కడుతుంటే స్థానిక మున్సిపల్​అధికారులు ఏం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇది ఈ ఒక్క భవనానికి సంబంధించిన ప్రశ్నే కాదు.. మూడు కార్పొరేషన్ల పరిధిలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రేటర్​లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా.. ఆ విషయం టౌన్​ప్లానింగ్, మున్సిపల్​అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్నది బహిరంగ సత్యం. చెరువులు, కుంటల పరిధిలో కబ్జాలకు ఇరిగేషన్ ఆఫీసర్లు, సర్కారు జాగలకు సంబంధించి రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. 

నోటీసులిచ్చాం. .ఇంకేం చేయాలి?   

చెరువులు, పార్కుల స్థలాలతో పాటు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు సాగుతున్నా మున్సిపల్ అధికారులు గానీ, రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు స్పందించడంలేదు. దీనికి కారణం కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు ముడుపులు ముడుతుండడమే. ఉదాహరణకు మన ఇంటి స్థలాన్ని ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే వారితో గొడవ పెట్టుకుంటాం.

అవసరమైతే కోర్టుకు వెళ్లి మరీ తేల్చుకుంటాం. ఎందుకంటే అది మనది కాబట్టి.. కానీ, కొంతమంది స్వార్థపరులైన అధికారులు, సిబ్బంది అలా అనుకోవడం లేదు. గవర్నమెంట్​నుంచి ప్రతి నెలా జీతం తీసుకుంటూ కబ్జారాయుళ్లకు వత్తాసు పలుకుతున్నారు. అదనపు ఆదాయం కోసం ఆక్రమించి అంతస్తులకు అంతస్తులు కడుతున్నా పట్టించుకోవడం లేదు.  

విషయం తెలిసి సామాజిక కార్యకర్తలో, స్థానికులో ప్రశ్నిస్తే ‘నోటీసు ఇచ్చాం’ అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి అధికారులు అండదండలతో కొన్ని చోట్ల కబ్జాదారులు బరితెగిస్తున్నారు. ఎక్కడో ఒక సర్వే నంబర్​లో పర్మిషన్ తీసుకుని ప్రభుత్వ స్థలాల్లో భారీ బిల్డింగులు కడుతున్నారు. ఈ లొకేషన్ షిఫ్టింగ్ వ్యవహారం అధికారులకు తెలిసే జరుగుతున్నా ఏమీ తెలియనట్టే ఉంటున్నారు. అంతలోపే ఆ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్న కబ్జాదారులు అమ్మకుని పోతున్నారు. 

కొనుక్కున్న వారికీ కష్టాలు 

కబ్జారాయుళ్లు అమ్ముకున్న ఇండ్లను జీవితాంతం పైసా పైసా కూడబెట్టి కొనుక్కుంటున్న సాధారణ ప్రజలు తిప్పలు పడాల్సి వస్తున్నది. అక్రమణ నిర్మాణమని తెలిసి హైడ్రా కూల్చివేతలకు వెళ్తే అప్పటికే ఆ ఇండ్లల్లో జనం కనిపిస్తున్నారు. అడిగితే భూములు, జాగలు అమ్ముకుని కొనుక్కున్నామని కొందరు, బ్యాంకు లోన్లు తెచ్చుకొని కొన్నామని మరికొందరు చెప్తున్నారు.

దీంతో హైడ్రా అలాంటి భవనాలను వదిలేయాల్సి వస్తోంది. నిర్మాణాలు పూర్తయినా విక్రయించని వాటిని, జనం లేని వాటినే హైడ్రా తొలగిస్తున్నది. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న బిల్డర్లు.. నిర్మాణం పూర్తయిన వెంటనే తక్కువ ధరకైనా సరే ప్లాట్లను అమ్మేసి ఉడాయిస్తున్నారు. నిర్మాణాలు పూర్తయినా అమ్మకం కాని ఇండ్ల విషయంలో బిల్డర్లు తెలివిగా తెలిసిన వారికి అద్దెలకు ఇస్తూ హైడ్రాకు చెక్​పెడుతున్నారు. 

యాక్షన్​ తీసుకోవాలంటూ హైడ్రా లెటర్లు

ప్రతి ఆక్రమణ వెనక అధికారుల అవినీతి వ్యవహారం హైడ్రా దృష్టికి రావడంతో సీరియస్​యాక్షన్​కు సిద్ధమైంది. కేవలం ఆక్రమణలను కూల్చడానికే పరిమితం కాకుండా వాటిని కడుతున్న టైంలో ఆ ప్రాంతానికి బాధ్యులైన మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులకు లెటర్లు రాస్తోంది. అయితే, అక్రమ నిర్మాణాలకు సహకరించిన అవినీతి అధికారులపై నామమాత్రపు చర్యలు కాకుండా వారి ఆస్తులను జప్తు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి సర్వీసు నుంచి తొలగించేలా చట్టం చేయాలని ప్రజాసంఘాలు, మేథావులు డిమాండ్​చేస్తున్నారు. 

అవినీతిలో వారిదే ముఖ్యపాత్ర 

సర్కార్ భూములను ఆక్రమిస్తున్న వారికి ప్రధానంగా కొంతమంది మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సపోర్టు చేస్తుండగా, ఇందులో ముఖ్యంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులదే కీలకంగా ఉంటున్నారు. ఏదైనా చెరువుకు ఆనుకొని లేదా అదే సర్వే నెంబర్లలో నిర్మాణాలు జరుపుకుంటున్న వాటికి ఇరిగేషన్ అధికారులే ఎన్​వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర ప్రభుత్వ స్థలాలకైతే  రెవెన్యూ అధికారులు ఎన్ వోసీ ఇస్తారు.

అయితే హైడ్రా లేనప్పుడు ఇష్టానుసారంగా ఎన్ వోసీలు ఇవ్వగా, వాటి ఆధారంగా మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు హైడ్రా ఆక్రమణలను గుర్తించి యాక్షన్​లోకి దిగుతుంటే ఎన్ వోసీలు ఇచ్చిన అధికారులే ఇప్పుడు ఆక్రమణలోనే ఉన్నాయని తిరిగి మున్సిపల్​అధికారులకు లెటర్లు రాస్తున్నారు. 

ఓకే కట్టుకోండి​.. అయ్యో.. తప్పు జరిగింది 

మదీనాగూడలోని పటేల్ చెరువు బఫర్ జోన్​లో లోటస్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్​నిర్మాణం కోసం అనుమతులు పొందింది. అప్పట్లో ఇరిగేషన్ అధికారులు ఎన్ వోసీ ఇచ్చారు. దీని ఆధారంగా జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. అదే ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఈ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ పూర్తిగా బఫర్ జోన్​లో ఉందని జీహెచ్ఎంసీకి నెలక్రితం లెటర్ రాశారు. ప్రస్తుతం ఈ భవనానికి సంబంధించిన ఆక్యూపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పెండింగ్ లో ఉంది. దీన్ని బట్టి అధికారులు ఎలా పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.