సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీ

 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో  హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీ

కోల్‌‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో హైదరాబాద్‌‌ దూసుకెళ్తోంది. మెగా టోర్నీలో వరుసగా మూడో విజయంతో  హ్యాట్రిక్ సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌‌లో గురువారం జరిగిన గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్‌‌‌‌ను ఓడించింది. తొలుత జమ్మూ 19.3 ఓవర్లలో 112 రన్స్‌‌కే ఆలౌటైంది. కెప్టెన్ శుభం ఖజురియా (35), కన్వల్‌‌ప్రీత్ సింగ్ (21) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ నితిన్ సాయి యాదవ్ (3/17), పేసర్ సీవీ మిలింద్ (3/31) చెరో మూడు వికెట్లతో జమ్మూను దెబ్బకొట్టగా.. రక్షణ్ రెడ్డి (2/21) రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌‌లో టాపార్డర్ ఫెయిలైనా తనయ్ త్యాగరాజన్ (33 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 50), ప్రజ్ఞయ్ రెడ్డి (31 నాటౌట్‌‌) మెరుపులతో హైదరాబాద్ 15.1 ఓవర్లలో 115/6 స్కోరు చేసి గెలిచింది. నితిన్ సాయికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్‌‌ల్లో నాలుగో విజయంతో టాప్‌‌ ప్లేస్‌‌లో (16 పాయింట్లు) ఉన్న హైదరాబాద్ క్వార్టర్స్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. శనివారం జరిగే తర్వాతి పోరులో  బీహార్‌‌‌‌తో తలపడుతుంది. 

బరోడా ఘన విజయం 

గ్రూప్‌‌–సిలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌‌లో బరోడా 8 వికెట్ల తేడాతో గుజరాత్‌‌ను చిత్తు చేసింది. తొలుత గుజరాత్ 14.1 ఓవర్లలో 73 రన్స్‌‌కే కుప్పకూలింది. రాజ్‌‌లంబాని మూడు వికెట్లు పడగొట్టగా.. 4 ఓవర్లు వేసిన హార్దిక్‌ పాండ్యా కూడా ఓ వికెట్‌‌ తీశాడు. అనంతరం బరోడా 6.4 ఓవర్లలోనే 74/2 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు శాశ్వత్ రావత్ (30 నాటౌట్‌‌), విష్ణు సోలంకి (27) రాణించగా.. పాండ్యా (10) తొందరగానే ఔటయ్యాడు. కాగా,ఈ మ్యాచ్‌‌ జింఖానా గ్రౌండ్‌‌లో జరగాల్సి ఉండగా.. పాండ్యాను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌‌ వస్తున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించారు.