జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది చేపట్టిన ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. నాగోల్ మెట్రో ఆఫీస్ దగ్గర టికెటింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. మెట్రోలో తమకు ఉచిత ట్రావెలింగ్, వసతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ జీతం రూ. 11 వేల నుంచి రూ. 20 వేలకు పెంచాలంటున్నారు.
తమ వేతనాలు పెంచాలంటూ మంగళవారం కూడా మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లో నిరసన చేపట్టారు. తమకు జీతాలు పెంచాలని మెట్రో ప్రాజెక్ట్ లో పని చేస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగులు డిమాండ్ చేశారు. మెట్రోస్టేషన్స్ లో టికెటింగ్, మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలోనూ తమకు చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరో రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదన్నారు.
హెచ్‌ఎంఆర్ మేనేజ్‌మెంట్ ప్రకటన
మరోవైపు మెట్రో కాంట్రాక్టు సిబ్బంది ఆందోళనలపై కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ కియోలిస్ స్పందించింది. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి..హైదరాబాద్ మెట్రో ట్రైన్ కార్యకలాపాలకు అవాంతరాలు కలిగించారని హెచ్‌ఎంఆర్ మేనేజ్‌మెంట్ ఆరోపించింది. మెట్రోట్రైన్ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని పేర్కొంది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపింది. మెట్రో ట్రైన్ కార్యకలాపాలు నిర్ధేశిత సమయానికే నడుస్తున్నాయని తెలిపింది.
కాంట్రాక్టు సిబ్బందితో చర్చలు
మెట్రో టికెటింగ్ సిబ్బందితో కియోలిస్ ఏజెన్సీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ఐదుగురు టికెటింగ్ సిబ్బందితో చర్చలు నిర్వహించారు. వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామని నిర్వాహకులు తెలిపారు. దీంతో ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్పష్టమైన హామీ వచ్చేవరకు విధులకు హాజరుకామని టికెటింగ్ సిబ్బంది స్పష్టం చేశారు.

