PBKS vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (2026, ఏప్రిల్ 28న) న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) vs రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగబోతుంది. ముల్లాంపూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కానీ ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉందనే వార్త అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. దీంతో న్యూ చండీగఢ్ తాజాగా వాతావరణం ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం.
ముల్లాంపూర్‌లో వెదర్:
భారత వాతావరణ శాఖ (IMD) నివేదిక ప్రకారం.. చండీగఢ్‌లో వర్షం కురిసే ఛాన్స్ మాత్రం ఉంది. కానీ, వర్షం పడే సూచనలు 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే ఉన్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అంటే మ్యాచ్‌కు స్వల్ప అంతరాయం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, పూర్తి మ్యాచ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మంగళవారం న్యూ చండీగఢ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదు అయ్యే అవకాశం ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
మ్యాచ్ జరిగేటప్పుడు వర్షం?:
పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే అవకాశం సుమారు 40 శాతం వరకు ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది. అయితే, రాత్రి గడిచే కొద్దీ వర్ష సూచనలు తగ్గుతాయని సమాచారం. రాత్రి 9:30 గంటల సమయానికి వర్షం పడే ఛాన్స్ కేవలం 20 శాతానికి పడిపోనుంది. కాబట్టి క్రికెట్ అభిమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ మ్యాచ్ సజావుగానే సాగుతుందని నిర్వహకులు తెలియజేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 39 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే వర్షం కారణంగా క్యాన్సిల్ అయింది. ఆశ్చర్యకరంగా ఆ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిందే, అందుకే అభిమానులకు ఈసారి అలాంటి భయం పట్టుకుంది.
ముల్లాంపూర్‌లో ఇదే లాస్ట్ మ్యాచ్:
ఈ సీజన్‌లో ముల్లాంపూర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో మ్యాచ్ ఇది.. పంజాబ్ కింగ్స్ తన నెక్ట్స్ హోమ్ మ్యాచులను ధర్మశాలలో ఆడబోతుంది. ఒకవేళ ముల్లాంపూర్‌కు ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల ఆతిథ్యం ఇవ్వకపోతే, ఈ స్టేడియంలో ఈ సీజన్‌కు ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ కానుంది. అందుకే ఈ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. మరి ఈ వీడ్కోలు మ్యాచ్‌కు వర్షం ఏ మేరకు హెల్ప్ చేస్తాడో చూడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నెంబర్–1 స్థానంలో ఉంది, ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లో 6 గెలిచి, ఒకటి వర్షంతో రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో ఓడినా, గెలిచినా పంజాబ్ అగ్రస్థానంలోనే ఉండనుంది.

