V6 News

ఇంత క్రూరంగా ఉన్నావేంట్రా బాబు: బస్సు బోర్డు చదవలేదని 74 ఏళ్ల వృద్ధుడిని కొట్టిచంపిన యువకుడు

ఇంత క్రూరంగా ఉన్నావేంట్రా బాబు: బస్సు బోర్డు చదవలేదని 74 ఏళ్ల వృద్ధుడిని కొట్టిచంపిన యువకుడు

చెన్నై: ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు మధ్య గొడవలు జరిగిన ఘటనలు చాలా చూశాం. జట్లు జట్లు పట్టుకుని కొట్టుకోవడం.. పిడిగుద్దులు కురిపించుకున్న సీన్స్ కూడా ఎన్నో చూశాం. చిల్లర విషయంలో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య పంచాయతీలు చూశాం. ఆపమన్న చోట బస్సు ఆపలేదని డ్రైవర్‎తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన సంఘటనలు చూశాం. కానీ బస్సు బోర్డుపై ఉన్న పేరు చదివే విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బస్సు బోర్డు చదివేందుకు నిరాకరించిన 74 ఏళ్ల వృద్ధుడిని కొట్టిచంపాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

25 ఏళ్ల అమర్నాథ్ తాంబరం బస్ స్టాండ్‎లో గూడువంచేరి నుంచి వడపళని వెళ్లే బస్సు ఎక్కాడు. ఇదే బస్సును తాంబరం ఎంఈపీజెడ్ బస్ స్టాప్ దగ్గర చంద్రశేఖరన్ (74) ఎక్కి అమర్నాథ్ పక్కన కూర్చుకున్నాడు. పక్కనే కూర్చున్న చంద్రశేఖరన్‎ను బస్సు బోర్డుపై ఉన్న పేరు చదవాలని అమర్నాథ్ కోరాడు. ఇందుకు చంద్రశేఖరన్ నిరాకరించాడు. తాను చదవనని.. అంత అవసరమనుకుంటే కండక్టర్‎ను అడగాలని సూచించాడు. చంద్రశేఖరన్ తిరస్కరించినప్పటికీ బస్సు బోర్డు చదవాలని అమర్నాథ్​ పట్టుబట్టాడు. ఇందుకు చంద్రశేఖరన్ ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

ఇంతలో బస్సు కండక్టర్ కలగజేసుకుని చంద్రశేఖరన్ను వేరు సీటులోకి వెళ్లామని చెప్పాడు. కండక్టర్ సూచన మేరకు చంద్రశేఖరన్ వేరే సీటులోకి వెళ్తుండగా అమర్నాథ్ అతడిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. చంద్రశేఖరన్ ను కిందపడేసి గొంతు నులిమి ముఖం, చాతీపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖరన్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. తోటి ప్రయాణికులు చంద్రశేఖరన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

అమర్నాథ్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా బస్సులోని ప్రయాణికులు అతడిని పట్టుకుని చితకబాదారు. బస్సును క్రోమ్ పేట్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అమర్నాథ్‎ను అరెస్ట్ చేశారు.  ఘటనా సమయంలో అమర్నాథ్ మత్తుపదార్థాలు లేదా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. విల్లుపురం వాసి అయిన అమర్నాథ్ చెన్నైలో మేస్త్రీగా పనిచేస్తుండగా.. మృతుడు చంద్రశేఖరన్ తాంబరం సమీపంలోని పడప్పైకి చెందిన ఎలక్ట్రిషియన్ అని పోలీసులు తెలిపారు.