ఫ్యాన్సీ నంబర్ల కోసం ఈ- బిడ్డింగ్

ఫ్యాన్సీ నంబర్ల కోసం ఈ- బిడ్డింగ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగుఫ్యాన్సీ, స్పెషల్​ నంబర్ల కోసం ఆర్టీఏ ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. ఆన్​లైన్​లోనే పొందేందుకు ఈ—బిడ్డింగ్​ విధానం అమల్లోకి తెచ్చినట్టు రవాణా మంత్రి పవ్వాడ అజయ్​కుమార్​ తెలిపారు. ఫ్యాన్సీ నంబర్లతోపాటు 59 సర్వీసులను ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి కొత్త చాంబర్‌‌‌‌ను బుధవారం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తొలి సంతకం ఈ-బిడ్డింగ్‌‌‌‌పైనే చేశానని, ఈ విధానంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరుగుతుందని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ ఎవరైనా, ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే వాహనదారులకు ఇబ్బందులు
తప్పుతాయన్నారు.

మేడారం జాతరకు 4 వేల బస్సులు

త్వరలో ఆర్టీసీలో చాలా మార్పులు చేస్తామని, గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తామని, గతానికి భిన్నంగా కొత్త ఆర్టీసీని ప్రజల్లోకి తెస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీలో 50 కార్గో బస్సులు సిద్ధంగా ఉన్నాయని, ఫిబ్రవరి తొలి వారంలో కార్గోను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. ప్రతి డిపోను లాభాల్లో నడిపేందుకు అధికారులు దత్తత తీసుకుని చర్యలు తీసుకుంటారన్నారు. గత నెలలో ఆర్టీసీ సొంత ఆదాయంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందని, ఇది శుభపరిణామమని తెలిపారు. ఈ నెలలో పండుగ టైమ్​లో రూ.16.8 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది ఆర్టీసీ చరిత్రలో రికార్డని చెప్పారు. మార్చి 31లోపు ఆర్టీసీ ఉద్యోగులకు సమ్మె కాలం వేతనాలు చెల్లిస్తామన్నారు. సమ్మె కాలంలో అవినీతిపై విచారణ జరువుతున్నామన్నారు. మేడారం జాతరకు 4 వేల బస్సులను నడపనున్నామని, అక్కడ బేస్ క్యాంప్‌‌‌‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వారం మొత్తం రోడ్డు భద్రతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులపై భద్రత స్లోగన్స్‌‌‌‌ ముద్రిస్తామని చెప్పారు. త్వరలోనే బస్సు డ్రైవర్లందరికీ మైక్‌‌‌‌ను అందిస్తామని, బస్సు ఎక్కడికి వచ్చిందో డ్రైవర్‌‌‌‌ మైక్‌‌‌‌లో చెబుతారని, దీని ద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉందన్నారు.

బడ్జెట్‌‌‌‌లో ఆర్టీసీకి 1500 కోట్ల ప్రతిపాదనలు

ఆర్టీసీ రూట్లలో ఒక్క ప్రైవేట్ బస్సుకు పర్మిషన్​ ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిసారి బడ్జెట్లో ఆర్టీసీకి రూ.500 కోట్ల దాకా కేటాయిస్తున్నారని, ఈసారి
రూ.1,500కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పెట్టామని చెప్పారు. ఇప్పటి దాకా సంస్థలో ఒక్క ఉద్యోగిని కూడా సస్పెండ్‌‌‌‌ చేయలేదని, చేయబోమని, ఉద్యోగుల హక్కులను కాపాడతామని, ఉన్నతాధికారులు ఉద్యోగులను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆర్టీసీలో సమస్యలు ఉంటే నేరుగా తన మొబైల్‌‌‌‌ నంబర్‌‌‌‌ 98495 55778కు ఫిర్యాదు చేయాలని, 24 గంటల్లో చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆర్థిక మాంద్యం రవాణా శాఖపై కూడా ఉందని ట్యాక్స్ రెవెన్యూ తగ్గిందని చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ సునీల్‌‌‌‌ శర్మ, కమిషనర్‌‌‌‌ సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ సుల్తానియా, ఈడీలు టీవీరావు, పురుషోత్తంనాయక్‌‌‌‌, యాదగిరి, వినోద్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.