
కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్. ఏ జట్టు గెలుస్తుంది..ఏ జట్టు ఓడుతుంది..ఏ బ్యాటర్ ఎన్ని పరుగులు చేస్తారు..ఏ బౌలర్ ఎన్ని వికెట్లు సాధిస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ ఉత్కంఠను కొందరు బెట్టింగ్ బాబులు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా కోట్లకు కోట్లుగా పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ నిర్వహణపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యంగా సిటీ పరిసర ప్రాంతాల్లోని ఫాంహౌజ్లలో విచ్చలవిడిగా బెట్టింగ్ నిర్వహిస్తుండటంతో పోలీసులు వాటిపై దృష్టి సారించారు.
ఫైనల్ మ్యాచ్ టార్గెట్..
ఇన్నాళ్లు ఒక లెక్క..ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు బెట్టింగ్ రాయళ్లు వ్యవహరిస్తున్నారు. లీగ్ దశల్లో సంపాదించింది ఒక ఎత్తు అయితే..ఫైనల్ మ్యాచ్ లో వచ్చేది మరో ఎత్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో లీగ్ మ్యాచుల్లో బెట్టింగ్ నిర్వహించి నష్టపోయినా పట్టించుకోరు. కారణం ప్లేఆఫ్ మ్యాచులు ఉన్నాయని.ప్లేఆఫ్ మ్యాచుల కంటే..ఫైనల్ కు మరింత సంపాదించవచ్చు. అందుకే ఫైనల్ పైనే బెట్టింగ్ రాయళ్లు తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ ఒక్క మ్యాచుతో కోట్లు వెనకేసుకోవాలని వారి టార్గెట్. తమ ప్లాన్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కు భారీగా బెట్టింగ్ నిర్వహించేందుకు అంతా సిద్దం చేసుకున్నారు.
పోలీసుల హెచ్చరిక..
ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ ముఠా ఎక్కువగా బార్లు, పబ్‌లు, వ్యక్తిగత ఇళ్లలో బెట్టింగ్ లు నిర్వహించారు. అయితే వీటిపై పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయళ్లు తెలివి ప్రదర్శిస్తూ..హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లను బెట్టింగ్ కు అడ్డాగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. నగర పరిసర ప్రాంతాల్లోని ఫేమస్ ఫాం హౌజ్ లపై పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు.
ఎంత పట్టుకున్నారు..
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు పలు బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ. 4.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 54 మంది అరెస్ట్ చేశారు. భారీగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను సీజ్ చేశారు. కొందరు యువకులు బెట్టింగ్కు పాల్పడి అప్పుల పాలై ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.