వీడియో: హైదరాబాద్ పోలీసులా.. మజాకా! స్టేషన్‌లోనే ప్రీ వెడ్డింగ్ షూట్

వీడియో: హైదరాబాద్ పోలీసులా.. మజాకా! స్టేషన్‌లోనే ప్రీ వెడ్డింగ్ షూట్

పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే తీయని వేడుక. మరి ఆ సంబురానికి సంబంధించిన జ్ఞాపకాలు పదిలంగా ఉండాలి కదా! అందుకో మార్గం ఉంది.. అదే ఫొటోషూట్‌. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్‌ బాగా ఎక్కువయ్యింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరుతో ఆయా జంటలు చేసే విన్యాసాలను మాటల్లో చెప్పలేం. సినిమాను తలపించేలా లొకేషన్స్, లైటింగ్‌, ఎఫెక్ట్స్‌, సెట్టింగులు అబ్బో. ఇలాంటివి మీరు కూడా తిలకించే ఉంటారు. మరి సాధారణ పౌరులే ఇలా ఉంటే.. హైదరాబాద్‌ పోలీసులు ఎలా ఉండాలి. ఇరగదీయాలి కదా! నిజంగానే ఇరగదీశారు.

నగరానికి చెందిన ఇద్దరు ఎస్ఐలు భావన, రావూరి కిషోర్‌(ఏఆర్‌ ఎస్ఐ) వివాహం గత నెల ఆగష్టు 26న జరిగింది. అయితే ఈ జంట పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకోగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వధువు భావన పోలీస్ వాహనంలో ఎంట్రీ ఇవ్వగా, వరుడు రావూరి కిషోర్‌ హీరో రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ షూట్ వీడియో ఆరంభంలో మూడు సింహాలను చూపపిస్తూ ఇచ్చిన ఎలెవేషన్స్, ఖుషీ సినిమాలోని సాంగ్.. అబ్బో సినిమాను తలపించేలా ఉన్న వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

కాకపోతే పోలీస్‌ స్టేషన్‌లో, పోలీస్‌ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకోవడం వివాదాస్పదమవుతోంది. విధి నిర్వహణలో ఫోటో షూట్‌ ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై పొలిసు ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఏమాటకామాట.. ఫోటో షూట్‌ మాత్రం బాగుంది.. మీరు కూడా ఒకసారి చూసేయండి.