ఫేక్​ డాక్యుమెంట్ల తయారీ ముఠా గుట్టు రట్టు

ఫేక్​ డాక్యుమెంట్ల తయారీ ముఠా గుట్టు రట్టు
  • వందల సంఖ్యలో నకిలీ సేల్ డీడ్స్, బర్త్ సర్టిఫికెట్ల తయారీ సామగ్రి స్వాధీనం 
  • పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు  
  • పరారీలో మరో ఏడుగురు
  • నిందితుల్లో నలుగురు 
  • వేర్వేరు మున్సిపాలిటీల్లో ఔట్ సోర్సింగ్  ఉద్యోగులు

ఎల్బీనగర్, వెలుగు: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద భారీగా నకిలీ స్టాంపు పేపర్లు, సర్టిఫికెట్లు,  రబ్బరు స్టాంపులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్  కుంట్లూరు ప్రాంతానికి చెందిన తోట వెంకట భానుప్రకాశ్ (55), తోట సాగరిక (38) భార్యాభర్తలు. 

వీరు కొన్నేళ్లుగా సరూర్ నగర్ లో సాత్విక ఎంటర్ ప్రైజెన్  పేరుతో జిరాక్స్,  టైపింగ్ సెంటర్  నిర్వహిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు నకిలీ స్టాంపు పేపర్ల తయారీని ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ స్టాంపు పేపర్ల దందా చేశారు. ఈ క్రమంలో నగరానికి చెందిన సయ్యద్  ఫిరోజ్ అలీ(34), హయత్ నగర్  హత్తిగూడకు చెందిన స్టాంప్  వెండర్స్  గూడూరు చంద్రశేఖర్ (64), అడ్డగూడురు అనిల్ (35), ఆకాష్ నగర్ కు చెందిన ఎండీ జలీల్ (33) తో భానుప్రకాశ్, సాగరికకు పరిచయం ఏర్పడింది. వీరందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అందరూ నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ఇచ్చేవారు. ఇలా ఒక్కో డాక్యుమెంట్ కు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారు.

జిల్లాల్లో కూడా దందాలు..

ఈ ముఠా సభ్యులు వారి దందాను జిల్లాలకు కూడా విస్తరించుకున్నారు. నల్లగొండ జిల్లా చందుపట్లకు చెందిన పులుసు మల్లేష్ గౌడ్  ఆ జిల్లాలో ఎవరికైనా బర్త్  సర్టిఫికెట్స్  కావాలంటే ఇచ్చేవాడు. కామారెడ్డి మున్సిపల్  ఆఫీసులో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీ  ప్రవీణ్, నార్సింగ్  మున్సిపాలిటీలో పనిచేసే దుడ్డు సుధీర్ కుమార్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్  ఆఫీస్  ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీ ముద్దసర్ తో పాటు వెంకట భానుప్రకాశ్  వద్ద నకిలీ సెల్ డీడ్  సర్టిఫికెట్లను రెగ్యులర్ గా కొనుగోలు చేసే యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు చెందిన జల్ల కిశోర్ కుమార్, ఫేక్  డాక్యుమెంట్లతో లోన్లు ఇప్పించే చంచల నిఖిల్ (ఖమ్మం జిల్లా), రబ్బర్  స్టాంపులు తయారు చేసే సత్యప్రభు (దిల్ సుఖ్ నగర్) ఈ కేసులో ఉన్నారు. వీరంతా కలిసి ఎక్కడ, ఏ నకిలీ డాక్యుమెంట్  కావాలన్నా తయారుచేసి విక్రయించారు. 

ఈ ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టిన ఎల్బీనగర్  ఎస్ఓటీ, సరూర్ నగర్  పోలీసులు ముఠాలోని తోట సాగరిక, తోట వెంకట భానుప్రకాశ్, అడ్డగూడురు చంద్రశేఖర్, అడ్డగూడురు అనిల్, ఎండీ జలీల్, జల్ల కిశోర్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఏడుగురు కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు విక్రయించిన నకిలీ స్టాంపు పేపర్లు, నకిలీ సర్టిఫికెట్లతో ఏఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో దర్యాప్తులో తెలుస్తుందన్నారు. ఈ ముఠా సభ్యులు ప్రస్తుతం ఉన్న అధికారులు, రిటైర్  అయిన అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించామని తెలిపారు.