V6 News

బిజినెస్ ఆఫర్లంటూ టోకరా.. సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డ టీచర్ 

బిజినెస్ ఆఫర్లంటూ టోకరా.. సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డ టీచర్ 

ఉప్పల్​, వెలుగు: బిజినెస్ అవకాశాల కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేసిన ఓ టీచర్.. సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. రామంతాపూర్ ప్రాంతానికి చెందిన ప్రైవేటు టీచర్ రాజ్యలక్ష్మి బిజినెస్ అవకాశాల కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేశారు. ఫిబ్రవరిలో ఫేస్​బుక్​లో వచ్చిన ఒక ప్రకటనను చూసి గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. అనంతరం ఆమెను ‘అమెజాన్ హబ్ పార్ట్నర్’ ప్రతినిధిగా ఓ వ్యక్తి కాల్​లో పరిచయం చేసుకుని నమ్మబలికాడు.

తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ. 17,700 వసూలు చేసి, ఆపై డెలివరీ కిట్ కోసం మరో రూ. 1,50,000 కట్టాలని, ఆ డబ్బు వెంటనే తిరిగి ఇచ్చేస్తామని నమ్మించాడు. దీంతో ఆమె విడతలవారీగా మరో రూ. 84,335 చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె కోరారు. ఆ మొత్తాన్ని ఐదేండ్ల తర్వాతే ఇస్తామంటూ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు శుక్రవారం సైబర్ క్రైమ్ హెల్ప్​లైన్​తో పాటు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.