రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. వారం రోజుల నుంచి మరీ తీవ్రంగా ఉన్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ ఎండలు మరో రెండు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. కానీ డ్యూటీ చేయక తప్పని ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్నారు. ఓ వైపు ఉక్కపోత మరోవైపు ఎండలతో నరకం అనుభవిస్తుంటే మరోవైపు ట్రాఫిక్ మళ్లింపుతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్, కొత్తగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ రోడ్డు వైపు శిల్పా లేవుట్ ఫేజ్-2 ఫ్లై ఓవర్ పనులు చేపట్టనున్నారు. దీంతో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సైబరాబాద్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్ వెల్లించారు. మే 13 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. దారి మళ్లింపు వైపు రావడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులు ఎంచుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ఒక్కో అధికారికి ఒక్కో రూట్ ను అధికారులు అలాట్ చేశారు.
దారి మళ్లింపు ఇలా..
- ORR వైపు నుంచి హఫీజ్‌పేటకు వెళ్లే వాహనదారులు శిల్పా లేఅవుట్ పై వంతెన నుంచి మీనాక్షి టవర్స్, డెలాయిట్, ఏఐజీ ఆసుపత్రి, క్యూమార్ట్, కొత్తగూడపై బ్రిడ్జ్ మీదుగా వెళ్లాలి.
- టెలికామ్ నగర్ నుంచి కొండాపూర్‌కు వచ్చే వాహనాలు.. గచ్చిబౌలి పై వంతెన కింద యూటర్న్ తీసుకోవాలి. అక్కడి నుంచి శిల్పాలేఅవుట్ పై వంతెన నుంచి మీనాక్షి టవర్స్, డెలాయిట్, AIG ఆసుపత్రి, క్యూ మార్ట్, కొత్తగూడ మార్గం గుండా రావాలి.
- లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపునకు వచ్చే వాహనాలు.. గచ్చిబౌలి ట్రాఫిక్ PS నుంచి డీఎల్‌ఎఫ్, రాడిసన్ హోటల్, కొత్తగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- నానక్ రాంగూడ విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ చౌరస్తా వైపునకు వెళ్లే వాహనాలు.. ట్రిపుల్ ఐటీ కూడలి వద్ద ఎడమ వైపు వెళ్లాలి. అక్కడి నుంచి గచ్చిబౌలి స్టేడియం ముందు యూటర్న్ తీసుకుని DLF, రాడిసన్ హోటల్ రోడ్డులో వెళ్లాలి.
- టోలిచౌకి నుంచి ఆల్విన్ చౌరస్తాకు వచ్చే వాహనదారులు.. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు కూడలి నుంచి మైండ్‌స్పేస్, సైబర్ టవర్స్, కొత్తగూడ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

