హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్.. మరో నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు

హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్..  మరో నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు

హైదరాబాద్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు గంటకు 40 నుంచి -50 కి.మీ. వేగంతో వీస్తాయని తెలిపింది. మరో నాలుగు రోజుల పాటు ( జులై16)   వానలు పడే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల వడగళ్ల వానలు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

తెలంగాణ రాగల నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.గురువారం నుంచి ఆదివారం ( జులై  13 నుంచి 16 )వరకు పలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.  భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని చెప్పింది.  కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.