అమ్మ దొంగా : నేను హేమను.. నా పేరు కృష్ణవేణి..

అమ్మ దొంగా : నేను హేమను.. నా పేరు కృష్ణవేణి..

వీడు నా ఫ్రెండ్.. వీడు వేసుకున్న చొక్కా నాదే అన్నట్లు.. నీ పేరు ఏంటీ అంటే నేను హేమను.. నా పేరు కృష్ణ వేణి.. మీరు ఎక్కడి వారు అంటే నేను ఇక్కడ అమ్మాయినే.. మా ఊరు హైదరాబాద్.. ఏంటీ ఈ ట్విస్టులు.. ఏంటీ డొంక తిరుగుడు సమాధానం అంటారా.. ఇవన్నీ వాళ్లు వీళ్లు చెప్పింది కాదంటండీ.. నటి హేమ విచారణలో ఇలా చెప్పిందంట.. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన తర్వాత నటి హేమ ఇలాంటి ట్విస్టులు ఇచ్చిందంట.. నీ పేరు ఏంటమ్మా అని పోలీసులు అడిగితే.. నా పేరు కృష్ణవేణి అని చెప్పిందంట.. రేవ్ పార్టీ విచారణలోనే ఇది బిగ్ ట్విస్ట్ అంటున్నారు బెంగళూరు సిటీ పోలీసులు. అయితే హేమ అసలు పేరు కృష్ణవేణి అట. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును హేమగా మార్చుకుందట. పూర్తి వివరాల్లోకి వెళితే...

మే 19వ తేదీ ఆదివారం రాత్రి బెంగళూరులో రేవ్ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పార్టీపై మే 20వ తేదీ సోమవారం తెల్లవారుజామున  బెంగళూరు పోలీసులు దాడులు చేసి దాదాపు 103మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో ప్రముఖ నటి హేమ కూడా పాల్గొన్నట్లు వార్తలు రాగా.. వాటిని ఆమె ఖండించారు. అయితే, రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.

ఈ పార్టీలో రకరకాల డ్రగ్స్ వాడినట్టు పోలీసులు తేల్చారు. పార్టీలో పాల్గొన్న 103 మందికి బ్లడ్ టెస్టులు చేయించారు. ఇందులో 73 మంది పురుషుల్లో 59 మందికి బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ వస్తే.. 30 మంది యువతుల్లో 27 మందికి పాజిటివ్  తేలింది. ఓవరాల్ గా పార్టీలో పాల్గొన్న 103 మందిలో 86 మందికి పాజిటివ్ గా వచ్చిందన్నారు పోలీసులు. బ్లడ్ రిపోర్టులో పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ నోటీసులిచ్చి విచారిస్తామన్నారు బెంగళూరు పోలీసులు. నటి హేమ బ్లడ్ రిపోర్టులోనూ పాజిటీవ్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు.  కాగా, బెంగళూరు రేవ్ పార్టీపై హెబ్బగోడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. రేవ్ పార్టీలో ఆరుగురిపై కేసు నమోదైంది.  ఏ1 వాసు, ఏ2 అరుణ్ కుమార్, ఏ3 నాగబాబుపై ఎఫ్ఆర్ఐ బుక్ చేశారు పోలీసులు.