Lavanya Tripathi: "మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను".. మెగా కోడలు మాస్ వార్నింగ్!

Lavanya Tripathi: "మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను".. మెగా కోడలు మాస్ వార్నింగ్!

మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే లావణ్య, తన కుటుంబ గౌరవం విషయంలో మాత్రం తగ్గేదే లేదంటూ ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవిపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వివాదం ఏంటంటే?

గత ఏడాది జరిగిన 'బ్రహ్మానందం' పుస్తకావిష్కరణ వేడుకలో చిరంజీవి సరదాగా మాట్లాడుతూ.. ఇంటికి వెళ్తే తాను "లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా" ఉంటానని, ఇంట్లో అంతా మహిళల రాజ్యమేనని వ్యాఖ్యానించారు. కుటుంబంలో ఆడవారి ఆధిపత్యం గురించి ఆయన చేసిన ఈ హాస్యభరిత వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుగా వక్రీకరించారు. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన దంపతులకు సంబంధించిన ఒక సందర్భాన్ని పురస్కరించుకుని, ఒక తమిళ మీడియా ట్రోలర్ ఈ పాత వీడియోను బయటకు తీశారు. రామ్ చరణ్‌కు కుమార్తె పుట్టినప్పుడు లేని వేడుక, బాబు పుట్టినప్పుడు కనిపిస్తోందంటూ విమర్శిస్తూ, మెగా కుటుంబంలో వివక్ష ఉందనే అర్థం వచ్చేలా వివాదాస్పద ట్వీట్ చేశారు.

లావణ్య త్రిపాఠి ఘాటు స్పందన

ఈ ట్వీట్ లావణ్య త్రిపాఠి దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ ట్వీట్ అత్యంత నీచమైన అభిరుచితో (Poor taste) ఉంది. ఒక స్వచ్ఛమైన సంతోషకరమైన క్షణాన్ని ఇలా అసహ్యంగా మార్చడం సరికాదు అంటూ ఆ ట్రోలర్‌కు గట్టి బుద్ధి చెప్పారు. చిరంజీవి మహిళలను ఎంతగా గౌరవిస్తారో తెలియకుండా ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

నా కుటుంబం జోలికి వస్తే..

తాజాగా లావణ్య త్రిపాఠి నటిస్తున్న 'సతీ లీలావతి' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ సందర్భంగా ఆమెకు మీడియా నుండి ఈ వివాదంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆమె సమాధానమిస్తూ.. "నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను. అందుకే నేను స్పందించాను. మా మావయ్య చిరంజీవి తన మనవరాళ్లను, ఇంట్లోని మహిళలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి వారికి లేదు అని స్పష్టం చేశారు.

ప్రశంసల జల్లు..

దీంతో నెట్టింట లావణ్య త్రిపాఠి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కుటుంబ గౌరవం కోసం నిలబడిన లావణ్యను 'నిజమైన మెగా కోడలు' అంటూ  మెగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న 'సతీ లీలావతి' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాతినేని సత్య దర్శకత్వంలో, దేవ్ మోహన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా లావణ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది లావణ్య.