రుణమాఫీ లేదు, బోనస్ లేదు .. రైతులు మోసపోయిన్రు : కిషన్ రెడ్డి

రుణమాఫీ లేదు, బోనస్ లేదు ..  రైతులు మోసపోయిన్రు :  కిషన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారిందని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వరి వేస్తే ఊరి అని కేసీఆర్ అంటే... రేవంత్ రెడ్డి దొడ్డు వడ్లు వేస్తే బొనస్ ఇవ్వమని అంటున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా  బీబీనగర్ మండలం రాఘవపురం రుద్రవెల్లి ఐకెపీ సెంటర్లను కిషన్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను ఆయన అడిగి తెలుసుకున్నారు.  45 రోజులు గడుస్తున్న కొనుగోలు ప్రక్రియ పూర్తికాకపోవడం..  కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కిషన్ రెడ్డి.  రుణమాఫీ లేదు బోనస్ లేదు రైతులు మోసపోయారన్నారు. దేవుడి మీదు ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగదన్నారు. మోడీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉందన్నారు కిషన్ రెడ్డి.  రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే అదే బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని మండిపడ్డారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని  బేషరతుగా కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.  సన్న రకం పేరు మీద .. దొడ్డు వడ్ల రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ సహించదని చెప్పారు.  ప్రభుత్వ వైఖరికి నిరసనగా త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.