జిల్లాల ఏకీకరణ అవసరమా?

జిల్లాల ఏకీకరణ అవసరమా?

రెండు ఎమ్మెల్యే నియోజక వర్గాలు కూడా లేని చిన్న ప్రాంతాన్ని కూడా జిల్లాగా చేయడం వంటి అవకతవకలు జరిగినమాట వాస్తవమే. గత ప్రభుత్వం చాలా జిల్లాలను అశాస్త్రీయంగా ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రజల ప్రయోజనాన్ని మించిన రాజకీయ ప్రయోజనమే  33 జిల్లాల ఏర్పాటులో కనిపిస్తున్నది. కానీ, ఒకసారి ఏర్పాటు చేసిన జిల్లాలను పున:పరిశీలిస్తే ఆయా కొత్త జిల్లాల స్థానిక ప్రజలు అసంతృప్తి చెందుతారేమో అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి జిల్లాల ఏకీకరణ చేస్తామని ఇటీవల ప్రకటించారు...

అది అనేక చిక్కులతో కూడుకున్న పని.  సావకాశంగా దానిపై ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి.  జిల్లాలను తగ్గించి ఏకీకరిస్తే ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతారు. ఉద్యమాలు చేస్తారు.  సిరిసిల్ల వంటి జిల్లాల ఏర్పాటు కోసం చాలా ఉద్యమాలు చేసి సాధించుకున్నారు.  ఉద్యమాల వల్ల 27 వరకు అనుకున్న జిల్లాలు క్రమంగా పెరిగి 33 జిల్లాలు చేశారు.  అంటే 6 జిల్లాల ఏర్పాటు అక్కరకు మించి అదనంగా జరిగినట్లే.  ఒకటి, రెండు జిల్లాలు గత ప్రభుత్వంలోని మంత్రుల అభీష్టం, ఒత్తిడితో  ఏర్పాటు జరిగిపోయింది నిజమే.    కొన్ని మండలాలను అస్తవ్యస్తంగా ఆయా జిల్లాల్లో కలిపింది నిజమే. ఇపుడవన్నీ సర్దుకున్నాయి.  రాజకీయ ప్రయోజనంతో  కొంత అశాస్త్రీయంగా ఏర్పాటు చేసినా.. ప్రజలకు జిల్లా పరిపాలన అందుబాటులోకి రావడాన్ని  కూడా ఇపుడు చూడాల్సివస్తోంది. చాలా  కొత్త జిల్లాలలో  జిల్లా కలెక్టరేట్ సముదాయాలు నిర్మితమయ్యాయి.  కుదురుకున్న జిల్లాలను మళ్లీ కదిలించి రాజకీయంగా తలనొప్పి తెచ్చుకోవడం అవుతుందేమో అని ముఖ్యమంత్రి లోతుగా ఆలోచించాలి.  కొత్త జిల్లాలకు అదనంగా చేసిన నియామకాలంటూ ఏమీ లేవు. ఉన్న ఉద్యోగులనే సర్దేశారు. కొందరు అవుట్ సోర్సింగ్​ ఉద్యోగులను తీసుకొని ఉండవచ్చు.  కొత్త జిల్లాల వల్ల  పరిపాలన కేంద్రం ప్రజలకు చేరువైంది.  దూరం తగ్గింది.  గతంలో  జిల్లా ఈ కొసకు పోవడం కన్నా పక్క జిల్లాలకు పోవడం సులభంగా ఉండేది.  మెట్ పల్లికి,  కాళేశ్వరానికి  ఎంత దూరమంటే  జీవితంలో ఒక్కసారైనా అటువారు ఇటు.. ఇటువారు అటు పోలేని దుస్థితి. అందుకు కొన్ని జిల్లాలు శాస్త్రీయంగా బాగానే ఉన్నాయి. కానీ మరికొన్ని అలా లేని మాట కూడా నిజమే.

అంతర్గత వలసాధిపత్యం

సంస్కృతి, భాష, విద్య , నైపుణ్యాల పరంగా,  నైసర్గిక పరంగా కూడా ఎన్నో వ్యత్యాసాలు.  తద్వారా జిల్లాలో అభివృద్ధి చెందిన ప్రాంతాలవారు వెనుకబడిన ప్రాంతాల భూములు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్లు ఆక్రమించారు. అలా అంతర్గత వలసాధిపత్యం సాగింది.  చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల వెనుకబడిన ప్రాంతాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు.  గతంలోని  371  ఆర్టికల్ ప్రకారం  జరిగిన  జోనల్ సిస్టం వల్ల వెనుకబడిన అదిలాబాద్ జిల్లా అవకాశాలు ఒకే జోన్ లో  ఉన్నందువల్ల  వరంగల్,  కరీంనగర్ , ఖమ్మం ప్రజలు  అందిపుచ్చుకున్నారు.  ఆదిలాబాద్  ప్రజలు ఎదిగి వచ్చేసరికి  నిరుద్యోగం ఎదురయింది.  కొత్త జిల్లాల  ఏర్పాటులో ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతాల ప్రకారం చేయాల్సి ఉండింది.  తద్వారా ఆదివాసీ  ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేది.  తెలంగాణలో  రైలు సౌకర్యాలు తక్కువ. అందువల్ల తక్కువ  దూరానికి  కూడా  ఎక్కువ  బస్సు చార్జీలతో  ప్రజలకు కష్టంగా ఉంది.  రైల్లో అయితే 140  కిలోమీటర్ల వరకు 3 నెలలకు  రైల్వే పాస్ తీసుకుంటే  రోజుకు పది రూపాయలతో 140 కిలోమీటర్ల వరకు  ప్రయాణించవచ్చు.  కాగా,  చిన్న జిల్లాల వల్ల దూరం తగ్గి సౌకర్యం పెరిగింది.

కందిరీగల తుట్టెను కదిలించడం ఎందుకు?

తక్షణం పరిష్కరించాల్సిన అనేక సమస్యలుండగా  కందిరీగల తుట్టెను  కదిలించడం ఎందుకు?  ముందుగా కులగణన చేపట్టాల్సి ఉంది.  స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి.  పార్లమెంటు ఎన్నికల ఫలితాలను అనుసరించి  ప్రభుత్వాన్ని,  పార్టీని  సంఘటితపరిచి  బలోపేతం చేసుకోవాలి.  నామినేటెడ్ పదవులను,  వైస్ చాన్సలర్లను,  లెక్చరర్లను,  ప్రొఫెసర్లను నియమించాల్సి ఉంది.  రెండు,  మూడు నెలలలో డీఎస్సీ ద్వారా  ఇతరత్రా  రెండు లక్షల ఉద్యోగాలు  నింపి యువతరం హృదయాలు గెలుచుకోవాలి.  కాళేశ్వరం సమస్యను పరిష్కరించి  వానాకాలం నీటిని  నిలుపుకొని వ్యవసాయానికి చేయూతనివ్వాలి.   తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన  హామీల అమలుకు  కసరత్తు చేయాలి.    35 వేల  కోట్ల అప్పుల  చెల్లింపులకు 9 శాతం వడ్డీని 2 శాతానికి మార్చుకోవడానికి అంతర్జాతీయ  బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి.    ఇన్ని  అత్యవసర  పనులు పూర్తిచేసి శభాష్  రేవంత్.. మహా ఘటికుడు, సమర్థుడు  సీఎం రేవంత్​రెడ్డి అని అనిపించుకోవలసిన  సమయంలో జిల్లాల ఏకీకరణ రచ్చ అవసరమా?

అభివృద్ధి వికేంద్రీకరణ

అభివృద్ధి వికేంద్రీకరణకు కొత్త జిల్లాల ఏర్పాటు చక్కని రాజమార్గం.  జిల్లాకొక మెడికల్ కాలేజీ,  అదేవిధంగా జిల్లాకు ఒక పారిశ్రామికవాడ,  జిల్లాల వారీ నియామకాలు స్థానిక అభివృద్ధికి తోడ్పడతాయి. పెద్దగా ఉంటే బలవంతులు తమ ప్రాంతానికే  వనరులు, అవకాశాలు లాక్కుపోతారు.  గతంలో అలానే లాక్కుపోయారు.  కేంద్రం  నవోదయ  విద్యాలయాలు మొదలైనవి  జిల్లాకొకటి అని ఇస్తున్నది.  చిన్న జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి.  ఒక్కమాటలో  చెప్పాలంటే 1986లో  మండలాల ఏర్పాటు వల్ల మండల కేంద్రాలు, చుట్టు పక్కల గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాయో అలానే చిన్న జిల్లాలు,  కొత్త జిల్లాలు అభివృద్ధి చెందుతున్నాయి.  జిల్లాలను  కలిపివేస్తే  ఈ అభివృద్ధి  కుంటుపడుతుంది.  మానవ స్వభావం ప్రకారం తమకు అందివచ్చిన లబ్ధిని  ప్రజలు ఎవరూ వదులుకోలేరు.  రాజకీయాల్లోనే కాదు.  ప్రతి మనిషిలోనూ  ఈ స్వభావం ఉంటుంది. కాబట్టి,  ప్రజలు,  ప్రతిపక్షాలు కొత్త జిల్లాలు  కొనసాగాలని ఆందోళన చేయడం, ఉద్యమించడం సహజం. 

-బిఎస్ రాములు, తెలంగాణ బీసీ కమిషన్​  మాజీ చైర్మన్​