
- గాంధీ దవాఖానలో 19 మందికి కొనసాగుతున్న చికిత్స
- కూకట్‌పల్లి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్
- బాలానగర్ ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో వేణుకుమార్‌పై సస్సెన్షన్ వేటు
కూకట్‌పల్లి/పద్మారావునగర్/బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో చాకలి పెద్ద గంగారాం(70) అనే వ్యక్తి ట్రీట్మెంట్పొందుతూ చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. కూకట్‌పల్లి ఆదర్శ్నగర్ఇంద్రహిల్స్లో నివాసం ఉంటున్న పెద్ద గంగారాం దివ్యాంగుడు. కల్తీ కల్లు తాగి వచ్చిన అతడు మంగళవారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాంతులు చేసుకున్నాడు.
దాంతో దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వివిధ టెస్టులు చేసిన డాక్టర్లు అతడి కిడ్నీలు ఫెయిల్అయినట్లు నిర్ధారించారు. ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలోనే బీపీ ఒక్కసారిగా తగ్గి, శుక్రవారం తెల్లవారుజామున గంగారాం మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీని తమ స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా బిచ్కుందకు తీసుకెళ్లినట్లు గంగారాం ఫ్యామిలీ మెంబర్స్వెల్లడించారు.
గాంధీలో 19 మందికి చికిత్స..
గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం మొత్తం 19 మంది కల్తీ కల్లు బాధితులకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ తెలిపారు. ఇందులో ఒకరు డాక్టర్లకు చెప్పకుండా (లామా) బయటకు వెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇద్దరికి డయాలసిస్ చేస్తున్నట్లు తెలిసింది. వీరికి కిడ్నీల్లో సమస్య ఉండటంతో వీరికి కంటిన్యూస్ రెనల్రిప్లేస్మెంట్ థెరపీ (సీఆర్ఆర్టీ) చేస్తున్నట్లు తెలిసింది.
రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: సీపీఐ
కల్తీ కల్లు ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర నాయకుడు డీజీ నర్సింహరావు డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహరావు మాట్లాడుతూ.. కూకట్‌పల్లి కల్తీ కల్లు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారని, 42 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, ఈ ఘటన చాలా తీవ్రమైనదని అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నిమ్స్దవాఖాన బులెటిన్
కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ దవాఖాన హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిలో కిడ్నీ ఎఫెక్టెడ్ బాధితుల సంఖ్య 9కి చేరిందని తెలిపింది. మరో ఇద్దరు బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పింది. 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, మరో 12 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
బాధితుల ఆరోగ్యంపై మంత్రి దామోదర ఆరా
కల్తీ కల్లు తాగి నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన నిమ్స్, గాంధీ ఆసుపత్రుల డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, రోగుల స్థితిగతులను వివరంగా తెలుసుకున్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో 35 మంది, గాంధీ ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న 35 మందిలో ఐదుగురిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నట్లు, మిగిలిన 30 మందికి చికిత్స కొనసాగుతున్నదని మంత్రికి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు.
అదే విధంగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 18 మందిలో నలుగురు డయాలసిస్‌పై ఉన్నారని, మిగిలిన 14 మంది రోగుల పరిస్థితి స్థిరంగా ఉందని మంత్రికి డాక్టర్లు వివరించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని డాక్టర్లు, అధికారులను మంత్రి ఆదేశించారు. రోగులు పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచి, ఆ తర్వాతే డిశ్చార్జ్ చేయాలని సూచించారు.
మూడు కాంపౌండ్స్ సీజ్
కూకట్‌పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. ఈ ఘటనకు ప్రధానంగా ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం బాలానగర్ ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో వేణుకుమార్‌పై ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. బాలానగర్ డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్‌లు మాధవయ్య, జీవన్‌కిరణ్, ఈఎస్ ఫయాజ్‌పై విచారణ కొనసాగుతున్నది.
అలాగే, కల్లులో ‘ఆల్ఫ్రాజోలం’ అనే రసాయనాన్ని కలిపి విక్రయించినట్టు నిర్ధారణ అయిన 3 దుకాణాల లైసెన్స్‌ను గురువారమే అధికారులు రద్దు చేశారు. కూకట్‌పల్లి పరిధిలోని హైదర్‌నగర్, సర్దార్‌పటేల్‌నగర్, హెచ్ఎంటీహిల్స్ సాయిచరణ్కాలనీలోని ఈ 3 కల్లు దుకాణాలను శుక్రవారం ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
‘కల్తీ కల్లు’ ప్రధాన నిందితుడు సత్యంగౌడ్ అరెస్టు
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కూన సత్యంగౌడ్‌ను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కల్తీ కల్లు ఘటన వెలుగులోకి వచ్చినప్పటినుంచి సత్యంగౌడ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో సత్యంగౌడ్ కోసం గాలింపు ముమ్మరం చేసిన ఎక్సైజ్ అధికారులు.. ఎట్టకేలకు అతడిని అరెస్టు చేశారు.