హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 30 వేల ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జనం మధ్య ఉండే నాయకుడని.. అతడిని గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ బైపోల్ క్యాంపెయినింగ్లో భాగంగా మంగళవారం (నవంబర్ 4) రెహమత్ నగర్లో సీఎం రేవంత్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మాగంటి గోపినాథ్ చనిపోవడంతో ఆయన సతీమణి సునీతను గెలిపించాలని బీఆర్ఎస్ కోరుతోంది.
గతంలో పీజేఆర్ చనిపోతే ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా మద్దతు ఇచ్చారు. కానీ, కేసీఆర్ మాత్రం అభ్యర్థిని నిలబెట్టి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నారు. గతంలో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబ నుంచే ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉండేది. కానీ పీజేఆర్ చనిపోయినప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టి ఆ మంచి సంప్రదాయానికి కేసీఆర్ తూట్లు పొడిచారు’’ అని విమర్శించారు.
సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటకు పంపిన దుర్మార్గుడు కేటీఆర్.. అలాంటాయనా మాగంటి సునీతమ్మను ఆదుకుంటాడంటే నమ్మేది ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి వాడు ఎవరింట్లోనైనా ఉంటే మా అక్కాచెల్లెళ్లు వాతలు పెడుతారని అన్నారు. సొంత చెల్లెను ఇంట్లో నుంచి గెంటేసిన కేటీఆర్.. మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లు మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ వాళ్లను చీపురు దెబ్బలు కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలకు, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు.
పదేళ్లుగా పాలించిన వాళ్లు పేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. ఇంట్లో ఆడబిడ్డను సరిగ్గా చూసుకోలేని వాళ్లు రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. బీఆరెస్ను ఎందుకు గెలిపించాలో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని.. రేషన్ కార్డులు రద్దు చేయడానికా..? సన్న బియ్యం, ఉచిత బస్సు రద్దు చేయడానికా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత నియోజకవర్గంలో పేదలకు 4 వేల ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
