హైదరాబాద్: మణికొండలోని పంచవటి కాలనీలో గన్ ఫైరింగ్ జరిగినట్లు మా దృష్టికి రాలేదని రాయదుర్గం సీఐ వెంకన్న క్లారిటీ ఇచ్చారు. కాల్పులకు సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మణికొండ పంచవటి కాలనీలో ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందని.. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేశారని చెప్పారు. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించామని.. దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, మణికొండలోని పంచవటి కాలనీలో మంగళవారం (నవంబర్ 4) కాల్పులు జరిగినట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆస్తి వివాదంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తి కాల్పులకు దారి తీసిందని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మణికొండ కాల్పుల ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి కాల్పులు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని వివరణ ఇచ్చారు.
