ఇండియాలో ఏదైనా సాధ్యమే. ఇక్కడ పుట్టని వారికి.. ఈ గడ్డపై కనీసం కాలు కూడా మోపని వారికి కూడా ఓట్లుంటాయి. అదికూడా ఒకటి ఉండొచ్చు.. 22 ఉండొచ్చు.. వంద కూడా ఉండవచ్చు. హర్యానా ఎన్నికల్లో ఇదే జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణల ద్వారా తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున ఓట్ చోరీ జరిగిందని రాహుల్ చేసిన ఆరోపణలు.. ఆయన చూపిన ఆధారాలు అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. బ్రెజిల్ మోడల్ ఫోటోపై ఓట్లు ఉన్నాయని సంచలన ఆధారాలు బయటపెట్టారు. ఎవరీ బ్రెజిల్ మోడల్.. ఆమెకు హర్యానాలో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. రాహుల్ ఆరోపణలకు ఆధారాలేంటి..? మొదలైన విషయాలు తెలుసుకుందాం.
ఢిల్లీలో బుధవారం (నవంబర్ 05) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సందర్భంగా సంచలన విషయాలు బయటపెట్టారు రాహుల్ గాంధీ. హర్యానా 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఓటర్ల లిస్టులో బ్రెజిల్ మోడల్ కు ఓట్లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేసిందని రాహుల్ గాంధీ అన్నారు. బ్రెజిల్ మోడల్ ఫోటోతో 10 బూత్ లలో 22 ఓట్లు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. సీమా, స్వీటి, సరస్వతి, సుమన్, రష్మీ లాంటి పేర్లతో ఈ మోడల్ కు ఓట్లు ఉన్నాయని ఆధారాలను బయటపెట్టారు.
ఎవరీ మోడల్:
హర్యానాలో బ్రెజిల్ మోడల్ కు ఓటు హక్కు కలిగి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే అసంబ్లీ సెగ్మెంట్లో 10 బూత్ లలో వివిధ పేర్లతో 22 ఓట్లు కలిగి ఉంది ఈ మోడల్. ఈమె పేరు మథ్యూస్ ఫెరెరో (Matheus Ferrero). ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్, మోడల్ అయిన ఫెరెరో పేరు లిస్టులో ఉండటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ సెర్చింగ్ లోకి వచ్చింది. బ్లూ జాకెట్ వేసుకుని ఉన్న ఫోటో.. 2017 మార్చి 02న పబ్లిష్ అయిన ఫోటో అది. ఈ ఫోటోకు 59 మిలియన్ల వ్యూస్ తో పాటు 4 లక్షల డౌన్ లోడ్స్ ఉన్నాయి.
కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ- ఈసీ కలిసి ఓట్ చోరీ:
ఇండియా కూటమిని ఓడించేందుకు బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసి ఓట్ చోరీకి పాల్పడిందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఆ రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 51 వేల 619 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని.. ఈసీ ఎందుకు తొలగించలేదని మండిపడ్డారు. బీజీపీ కార్యకర్తలు అయితే దేశంలో ఎక్కడైనా ఓటు వేయవచ్చా..? అని ప్రశ్నించారు. తాము ఎన్ని రుజువులు ఇచ్చినా ఈసీ అబద్ధాలు చెబుతోందని చెప్పారు.
►ALSO READ | ప్రతి ఎనిమిది ఓట్లకు ఒక ఫేక్ ఓటు.. హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు
హర్యానాలో భారీ స్థాయిలో ఓట్ల గల్లంతు జరిగిందన్నారు రాహుల్. ఆ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్ అనుకూలంగా వచ్చాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయని.. అయినప్పటికీ ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. చివరికి 22 వేల779 ఓట్లతో ఓడిపోయామని చెప్పారు.
హర్యానా ఎన్నికల్లో ఓట్ చోరీ పై ప్రెస్ మీట్ నిర్వహించిన రాహుల్.. అక్కడ మారు పేర్లతో ఒకే ఫోటోను యూజ్ చేసి ఓటర్ కార్డులు క్రియేట్ చేశారని అన్నారు. రాష్ట్రంలో మొత్తం డ్యూప్లికేట్ ఓటర్లు 5 లక్షల 21 వేల 619 మంది ఉన్నారని అన్నారు. తప్పుడు అడ్రస్ 93 వేల174 ఓట్లు ఉన్నట్లు చెప్పారు.
