తింటానికి తిండి లేదు.. చెప్పులు కూడా లేవు.. వరల్డ్ కప్ గెలిచిన అమ్మాయి క్రాంతి గౌడ్ జర్నీ

తింటానికి తిండి లేదు.. చెప్పులు కూడా లేవు.. వరల్డ్ కప్ గెలిచిన అమ్మాయి క్రాంతి గౌడ్ జర్నీ

క్రాంతి గౌడ్.. మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ.. ఉమెన్స్ వరల్డ్ కప్‎లో ఇండియా టైటిల్ గెల్చిన తర్వాత ఈ పేరు దేశవ్యాప్తంగా మోరుమోగిపోతుంది. కటిక పేదరికం.. కనీసం వేసుకోవడానికి చెప్పుల్లేవు.. 8వ తరగతిలోనే చదువు బంద్.. ఇన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని 22 ఏళ్లకే భారత మహిళల క్రికెట్ జట్టులోకి అరంగ్రేటం చేసింది. 

చిన్నప్పటి నుంచి తాను పెరిగిన కష్టాలను కసిగా మల్చుకోని అనతికాలంలోనే టీమిండియాలో ప్రధాన బౌలర్‎గా ఎదిగింది. భారత్ వేదికగా జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్‎లో ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా వరల్డ్ కప్‎లో దాయాది పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచులో అద్భుతమైన బౌలింగ్ ఫెర్ఫామెన్స్‎తో విమర్శకుల చేత కూడా క్రాంతి ప్రశంసలు అందుకుంది. 

చిన్న కష్టానికే భయపడి చేసే పనిని మధ్యలోనే వదిలేసే వారికి క్రాంతి గౌడ్ ఒక ప్రేరణగా మారింది. పట్టుదల, ప్రతిభ ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైన కలలను సాకారం చేసుకోవచ్చని రుజువు చేసింది. ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైన వెనక్కి తగ్గకుండా.. మొక్కవోని దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని  సాధించి ఇవాళ ఎంతో మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన టీమిండియా నయా పేస్ గన్ క్రాంతి గౌడ్ జర్నీ గురించి తెలుసుకుందాం.

కష్టాల ప్రయాణం..

ఇప్పుడు  క్రికెట్ ఆకాశంలో యువతారలా వెలుగుతున్న క్రాంతి ప్రస్థానం వెనుక కన్నీళ్లు, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష దాగున్నాయి. మధ్యప్రదేశ్‌‌‌‌లోని బుందేల్‌‌‌‌ఖండ్ ప్రాంతంలో ఉన్న ఘువారా అనే మారుమూల గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో ఆరుగురిలో చివరి సంతానంగా జన్మించింది క్రాంతి. తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో 8వ క్లాస్‌‌‌‌తోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. 

పుస్తకాలు పక్కన పెట్టినా క్రికెట్‌‌‌‌పై తనకున్న పిచ్చిని ఆమె  మాత్రం వదులుకోలేదు. కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా, ఊరిలోని రాళ్లు తేలిన మైదానంలోనే పరుగు పెడుతూ తన బౌలింగ్‌‌‌‌కు పదును పెట్టింది. కూతురి కళ్లలో కలను, పట్టుదలను చూసిన క్రాంతి తల్లి, తన మెడలోని పుస్తెలు అమ్మి ఆమె శిక్షణకు బాటలు వేసింది. ఆ త్యాగమే క్రాంతిని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.

నయా పేస్ గన్‌‌‌‌

సీనియర్లు రేణుకా సింగ్‌‌‌‌, పూజా వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌ గాయపడటంతో ఈ ఏడాది మేలో టీమిండియాలోకి వచ్చిన నాటి నుంచి క్రాంతి వెనుదిరిగి చూసుకోలేదు. కొలంబోలో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేసిన తను ఇంగ్లండ్ టూర్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో చివరి మ్యాచ్‌‌‌‌లో ఆరు వికెట్లు పడగొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌లో తన రాకను ఘనంగా చాటింది. అదే జోరును సొంతగడ్డపై ఆస్ట్రేలియాపైనా కొనసాగించింది. 

ప్రపంచంలోనే అత్యుత్తమ హిట్టర్‌‌‌‌గా పేరుగాంచిన ఆస్ట్రేలియా ప్లేయర్ అలీసా హీలీని వరుసగా మూడు మ్యాచ్‌‌‌‌ల్లో ఔట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌పై ఆమె ఆట అద్వితీయం. సీనియర్ రేణుకా ఠాకూర్‌‌‌‌ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా కొత్త బాల్‌‌‌‌తో క్రాంతి అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసింది. పాక్ టాపార్డర్‌‌‌‌ను కకావికలం చేసింది.

ఫీల్డ్ సెట్టింగ్ విషయంలో కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌తో వాదించి మరీ స్లిప్ ఫీల్డర్‌‌‌‌ను ఉంచమని కోరడం, ఆ తర్వాతి బాల్‌‌‌‌కే వికెట్ తీసి తన నిర్ణయం సరైనదని నిరూపించుకోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి, ఆటపై ఉన్న పట్టుకు నిలువుటద్దం అనొచ్చు. క్రాంతి గౌడ్ కేవలం ఒక క్రికెటర్ కాదు.. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి నిలువెత్తు నిదర్శనం. 

‘నాకు అందిన సహాయాన్ని తిరిగి సమాజానికి అందించాలి. డబ్బు లేదనే కారణంతో ఏ అమ్మాయి ఆటను వదులుకోకూడదు. వారికోసం ఓ అకాడమీని నడపడమే నా లక్ష్యం’ అంటున్న  క్రాంతి క్రికెట్ ప్రస్థానానికి ఇది ఆరంభం మాత్రమే. ఇదే పట్టుదలను, కసిని కొనసాగిస్తే తను మరెన్నో శిఖరాలు అధిరోహించడం ఖాయం.

రాత మార్చిన లోకల్‌‌‌‌ మ్యాచ్

ఓ లోకల్‌ టోర్నమెంట్‌‌‌‌లో ప్లేయర్ల కొరత కారణంగా అనుకోకుండా లభించిన అవకాశం క్రాంతి జీవితాన్నే మార్చేసింది. ఆ మ్యాచ్‌‌‌‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌‌‌గా నిలిచింది. బూట్లు కూడా లేని ఆ అమ్మాయిలోని అద్భుతమైన రనప్, పదునైన బౌలింగ్ యాక్షన్‌‌‌‌  కోచ్ రాజీవ్ బిల్తారేను కట్టి పడేసింది. 

క్రాంతిలో దాగున్న  ప్రతిభ అనే నిప్పుకణాన్ని గుర్తించిన బిల్లారే.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అకాడమీలో చేర్పించాడు. అక్కడే ఆమెకు తొలిసారిగా క్రికెట్‌‌‌‌ కిట్‌‌‌‌ అందింది. రూ.1600 ఇచ్చి స్పైక్స్ కొనిచ్చినప్పుడు క్రాంతి కళ్లలో మెరిసిన ఆనందం వెలకట్టలేనిది. ఆ తర్వాత, దేశంలోని మేటి కోచ్‌‌‌‌లలో ఒకరైన చంద్రకాంత్ పండిట్ మార్గదర్శకత్వంలో ఆమె ఆట మరింత పదునెక్కి, ఒక పదునైన ఆయుధంగా మారింది.