2025 వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలవడంతో టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. 52 ఏళ్ళ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ట్రోఫీ గెలవడంతో మన జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం (నవంబర్ 2) ముంబై వేదికగా హోరా హోరీగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ కలను సాకారం చేసుకుంది. ఈ వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడినా ప్రతీక రావల్ కు విన్నింగ్ మెడల్ లభించకపోవడం నిరాశకు గురి చేస్తోంది. ప్రతీకకు వరల్డ్ కప్ విన్నింగ్ మెడల్ ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు చూద్దాం..
ప్రతీక రావల్ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్, ఫైనల్ కు గాయం కారణంగా దూరమైంది. లీగ్ మ్యాచ్ ల్లో ఎంతో నిలకడగా రాణించిన ప్రతీక నాకౌట్ మ్యాచ్ లకు దూరం కావడంతో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అయితే రావల్ కు రీప్లేస్ గా వచ్చిన షెఫాలీ వర్మ అద్భుతంగా రాణించింది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్ లు ఆడిన ప్రతీక రావల్ నిలకడగా రాణించింది. 7 మ్యాచ్ లాడిన ఈ టీమిండియా ఓపెనర్ 51.33 యావరేజ్ తో 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో సెంచరీ చేసి సత్తా చాటింది. అయితే ప్రతీకకు విన్నింగ్ మెడల్ దక్కలేదు.
సెమీ ఫైనల్ కు ముందు గాయంతో ఈ టీమిండియా ఓపెనర్ దూరం కావడంతో ఆమెను స్క్వాడ్ నుంచి తప్పించారు. ప్రతీక స్థానంలో షెఫాలీని స్క్వాడ్ లో చేర్చారు. ఐసీసీ రూల్స్ ప్రకారం వరల్డ్ కప్ మెడల్ గెలవాలంటే 15 మంది స్క్వాడ్ లో ఉండాలి. స్క్వాడ్ లో 15 మందికే విన్నింగ్ మెడల్స్ దక్కుతాయి. ఈ కారణంగా ప్రీతీక రావల్ కు విన్నింగ్ మెడల్ లభించలేదు. టీమిండియా తరపున రెండో అత్యధిక టాప్ స్కోరర్ గా నిలిచిన ఆమెకు వరల్డ్ కప్ విన్నింగ్ మెడల్ లేకపోవడం నిరాశకు గురి చేస్తోంది.
ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సెలెబ్రేషన్ లో భాగంగా ప్రతీక రావల్ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. గాయంతో వీల్ చైర్ లో ఉన్న ప్రతీకను జట్టు మర్చిపోలేదు. క్రచెస్‌పై ఉంటూనే సెలెబ్రేషన్ చేసుకుంది. వీల్‌చైర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని తన చుట్టూ వేసుకుని, ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన.. రావల్ క్రచెస్ తో ఉన్నప్పటికీ పోడియం మీదకు తీసుకొని వచ్చి విజయానందాన్ని పంచుకుంది. మనసుకు ఎంతగానో హద్దుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
