బిడ్డకు ఇన్సులిన్ కూడా కొనలేకపోతున్నానని.. గన్ తో కాల్చుకుని రియల్టర్ సూసైడ్

బిడ్డకు ఇన్సులిన్ కూడా కొనలేకపోతున్నానని.. గన్ తో కాల్చుకుని రియల్టర్ సూసైడ్
  • అంతకుముందు తన ఆర్థిక పరిస్థితిపై ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ లో లైవ్.. యూపీలో ఘటన 

లక్నో: డయాబెటిక్ తో బాధపడుతున్న తన  కూతురికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా ఇప్పించలేకపోతున్నాననే ఆవేదనతో ఓ తండ్రి తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ లైవ్ లో గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ ఘటన లక్నోలో చోటుచేసుకుంది. 

గుడంబా ఏరియాకు చెందిన షాజెబ్ (45) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. కూతురికి చిన్నతనంలోనే డయాబెటిస్ వచ్చింది. ఆమెకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు. అయితే, వ్యాపారంలో నష్టాలతో షాజెబ్.. రూ.15 కోట్లదాకా అప్పులు చేశాడు. దాంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.  చివరకు  కూతురికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా కొనలేని స్థితికి చేరుకున్నాడు.  దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.  తన ఆఫీసులో పనిచేసే సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ లైవ్  లో ఏం చెప్పాడంటే.. 

తన సూసైడ్  కు ముందు షాజెబ్ ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ లైవ్ లో మాట్లాడాడు. ‘‘ నాకు రూ. 15 కోట్ల అప్పు ఉంది. నా కుతురికి డయాబెటిక్. అప్పుల భారంతో ఆమెకు ఇన్సులిన్ కొనేందుకు కూడా నా దగ్గర డబ్బు లేదు.  ఎటువంటి మార్గం కనిపించడం లేదు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను”అని చెప్పాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను వీడియో ద్వారా వేడుకున్నాడు. 

లైవ్ తర్వాత తనకు తాను కాల్చుకొని చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. షాజెబ్ మృతదేహాన్ని పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రియల్ ఎస్టేట్ లో భారీ నష్టాల వల్లే షాజెబ్ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

 బ్యాంకుల నుంచి వచ్చే రికవరీ నోటీసులు, లోన్ రికవరీ ఏజెంట్ల నుంచి ఒత్తిడి ఆయనను మానసికంగా కృంగదీసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా..  ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. షాజెబ్ ఆత్మహత్యకు లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని కుటుంబం చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.