
- ప్రస్తుతం టూరిస్ట్ వీసా ఫీజు రూ. 16 వేలు. ఇకపై రూ.40 వేలు
- స్టూడెంట్, వర్క్ వీసాలపైనా ఇదే స్థాయిలో పెరగనున్న ఫీజులు
వాషింగ్టన్: అమెరికా వెళ్లే టూరిస్టులు, స్టూడెంట్లు, ఉద్యోగుల వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం యూఎస్ టూరిస్ట్ వీసా ఫీజు రూ. 16,000 వరకూ ఉండగా, ఇకపై రూ. 40,000 దాటనుంది. అలాగే స్టూడెంట్, వర్క్ వీసాలకు కూడా ఇదే స్థాయిలో ఫీజులు ఉండనున్నాయి. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టం నిబంధనల ప్రకారం ఈ వీసా ఫీజులను పెంచినట్టు ఆ దేశ సర్కారు ప్రకటించింది.
నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీ వీసాలపై అదనంగా ఈ మేరకు ‘వీసా ఇంటెగ్రిటీ ఫీ’ని వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై ఫీజులు దాదాపు 2.5 రెట్లు పెరగనున్నాయి. పెరిగిన ఫీజులు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి. వీసా ఫీజులను ఏటా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ), ఇన్ ఫ్లేషన్కు అనుగుణంగా సవరించనున్నారు. కేవలం ఏ, జీ(డిప్లమాటిక్) కేటగిరీ వీసాలకు మాత్రమే పెంపు నుంచి మినహాయింపు ఉంటుంది.
వీసా రూల్స్ పాటించినోళ్లకే రీఫండ్..
ప్రస్తుతం యూఎస్ బీ1, బీ2 వీసా ఫీజు 185 డాలర్ల(రూ. 15,800) వరకూ ఉంది. ఇకపై వీసా ఇంటెగ్రిటీ ఫీజుతోపాటు ఐ94 ఫీ(24 డాలర్లు), ఈఎస్టీఏ ఫీ (13 డాలర్లు) కలిపి మొత్తం 472 డాలర్లు (రూ. 40,502) కానుంది. ప్రస్తుత వీసా ఫీజులతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. అయితే, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట తీసుకోనున్న వీసా ఇంటెగ్రిటీ ఫీజును కొన్ని షరతులు పాటించినవారికి మాత్రమే రీఫండ్ చేయనున్నారు. వీసా రూల్స్ ఉల్లంఘించిన వారికి మాత్రం ఈ రీఫండ్ వర్తించదు. కాగా, బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రకారం.. ఇండియన్లు సహా విదేశీయులు అమెరికా నుంచి తమ సొంత దేశాలకు పంపే డబ్బుల(రిమిట్టెన్సెస్)పై 1 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ ను ప్రకటించారు.