- ఇరాన్ మిలిటరీ అకాడమీ, భూగర్భ బంకర్లపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుదాడులు
- టెహ్రాన్‌పై వందల బాంబులతో విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్
- ఇరాన్ మిలిటరీ అకాడమీ, భూగర్భ బంకర్ల పేల్చివేత
- బహ్రెయిన్, సౌదీ, ఇజ్రాయెల్ ఎంబసీలపై ఇరాన్ క్షిపణుల దాడి
- ఇజ్రాయెల్ అణు కేంద్రంపైనా అటాక్
- ఇరాన్‌లో మరో స్కూల్‌పై దాడి.. 1,332కు పెరిగిన మృతులు
- పశ్చిమాసియాలో ఏడో రోజు మరింత భీకర యుద్ధం
- యుద్ధం కొనసాగితే పెట్రో ఉత్పత్తి ఆగుతది: ఖతార్ హెచ్చరిక
- ఖమేనీ హత్యకు స్పేస్ నుంచి బ్లూ స్పారో మిసైల్ ప్రయోగించిన ఇజ్రాయెల్
- ముందు ఇరాన్ కథ ముగిస్తాం.. ఆ తర్వాత క్యూబా సంగతి తేలుస్తం: ట్రంప్
- రష్యా నుంచి మళ్లీ ఆయిల్ కొనుగోలు ప్రారంభించిన ఇండియా
- పశ్చిమాసియాలో యుద్ధంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆందోళన
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పశ్చిమాసియాలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. అమెరికా, -ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఏడో రోజు వందల బాంబులతో భీకరమైన దాడులను నిర్వహించాయి. ఇరాన్ కూడా శుక్రవారం ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ బేస్‌లపై ప్రతీకార దాడులకు దిగింది. శుక్రవారం తెల్లవారుజామున టెహ్రాన్ నగరంలో గతంలో ఎన్నడూ లేనంత పేలుళ్లు సంభవించాయి.
ఈ దాడులు మున్ముందు ‘మరింత ఉధృతం కానున్నాయి’ అని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. నగరంలోని సైనిక స్థావరాలతో పాటు నివాస భవనాలు, కార్ పార్కింగ్ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, పాఠశాలలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు ‘అల్ జజీరా’ ప్రతినిధులు వెల్లడించారు. టెహ్రాన్ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి.
నిలోఫర్ స్క్వేర్ వద్ద ఉన్న ఒక ప్రాథమిక పాఠశాల క్షిపణి దాడిలో ధ్వంసమైంది. శుక్రవారం ఇజ్రాయెల్ దళాలు ఇరాన్, లెబనాన్ రాజధానులపై విరుచుకుపడగా, అమెరికా నౌకాదళం సముద్రంలో ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ క్యారియర్‌ను దహనం చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,332 మంది మరణించగా, వారిలో 181 మంది చిన్నారులు ఉన్నట్లు యూనిసెఫ్ ధ్రువీకరించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య తర్వాత కూడా ఆ దేశం లొంగిపోకపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బేషరతుగా లొంగిపోవాల్సిందే’ అని డిమాండ్ చేశారు. ఇరాన్ కథ ముగిసిన తర్వాత.. క్యూబా వంటి ఇతర దేశాల సంగతి తేలుస్తామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ భూగర్భ బంకర్ల పేల్చివేత
ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై విరుచుకుపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ నివాస సముదాయం కింద అత్యంత పటిష్టంగా నిర్మించిన భారీ భూగర్భ బంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. మొసాద్, ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అందించిన ఖచ్చితమైన సమాచారంతో సుమారు 50 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ బంకర్, యుద్ధ సమయంలో అత్యవసరంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉద్దేశించింది.
టెహ్రాన్ నగర వీధుల కింద విస్తరించి ఉన్న ఈ బంకర్‌లో అనేక ప్రవేశ మార్గాలు, అగ్రశ్రేణి అధికారుల సమావేశ గదులు ఉన్నాయి. అయితే, 'ఆపరేషన్ రోరింగ్ లయన్'లో భాగంగా జరిగిన ముందస్తు దాడుల్లోనే ఖమేనీ హతమవడంతో, ఆయన ఈ బంకర్‌ను ఉపయోగించుకోలేకపోయారు. ఆయన మరణం తర్వాత ఈ సముదాయాన్ని ఇరాన్ ప్రభుత్వ ఇతర ఉన్నతాధికారులు వాడుతున్నారు. అలాగే అమెరికాకు చెందిన బీ-2 స్టెల్త్ బాంబర్లు ఇరాన్ లోపల భూగర్భంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై 2,000 పౌండ్ల బరువున్న బాంబులను జారవిడిచాయి.
ఈ దాడులతో ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. కాగా, షిరాజ్ నగరంలోని జీబాషహర్ ప్రాంతంలో జరిగిన దాడిలో 20 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. లోరెస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ఆరుగురు సామాన్య పౌరులు గాయపడ్డారు. ఇస్ఫాహన్, కోమ్, కెర్మాన్‌షా నగరాల్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. క్షిపణి స్థావరాలున్న కెర్మాన్‌షా పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లలో అత్యధిక భాగాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇరాన్ భీకర ప్రతీకార దాడులు..
కువైట్ తీరంలో అమెరికాకు చెందిన ఒక చమురు ట్యాంకర్‌పై తాము దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ ట్యాంకర్ ప్రస్తుతం మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన పొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా దళాలున్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లపై వచ్చిన దాడులను ఆయా దేశాలు తిప్పికొట్టాయి.
ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి పరంపరను అడ్డుకునే క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేస్తూ దాడులను తిప్పికొడుతున్నాయి. మరోవైపు ఖతార్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. తమ ఇంధన కేంద్రాలపై జరిగిన సైనిక దాడుల కారణంగా ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఖతార్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది.
లెబనాన్‌లోనూ దాడులు ఉధృతం..
ఇజ్రాయెల్ దాడులు లెబనాన్ రాజధాని బీరూట్‌ను కూడా వణికించాయి. హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన 11 వైమానిక దాడుల వల్ల ప్రజలు ఇళ్లను వదిలి ప్రాణరక్షణ కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటివరకు ఈ యుద్ధం కారణంగా ఇరాన్‌లో 1,230 మంది, లెబనాన్‌లో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు అమెరికా సైనికులు కూడా మరణించారు. కాగా, ఇరాన్ తో యుద్ధం నేపథ్యంలో, రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసేందుకు భారతీయ రిఫైనరీలకు అమెరికా 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు (వైవర్) ప్రకటించింది.
శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ముంచేసిన నేపథ్యంలో ఇరాన్ కు చెందిన రెండో నౌక 'ఐఆర్ఐఎన్ఎస్ బుషెహర్'లోని 208 మంది సిబ్బందిలో 204 మందిని సురక్షితంగా కొలంబో ఓడరేవుకు తరలించినట్లు శ్రీలంక నౌకాదళం శుక్రవారం ప్రకటించింది. నౌకలోని ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా, ప్రస్తుతం ఆ నౌకపై మరో నలుగురు నావికులు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ నిలిపివేత.. ప్రమాదంలో పౌరులు
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ప్రస్తుతం కేవలం ఒక శాతం మందికే ఇంటర్నెట్ మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రజలకు యుద్ధ హెచ్చరికలు అందడం లేదు. అయితే, ఈ ఇంటర్నెట్ నిలిపివేత పౌరుల పాలిట శాపంగా మారింది.
సరైన ఎయిర్ రైడ్ వార్నింగ్ కానీ, షెల్టర్లు కానీ లేకపోవడంతో ప్రజలు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. గత జనవరిలో జరిగిన నిరసనల సమయంలో వేలాది మందిని చంపిన ప్రభుత్వం, ఇప్పుడు యుద్ధం సాకుతో కొత్త నిరసనలు తలెత్తకుండా సామాజిక మాధ్యమాలను అడ్డుకుంటోంది.
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే
ఇరాన్ మాకు బేషరతుగా లొంగిపోవాల్సిందే. ఆ తర్వాతే చర్చలు. ఇరాన్ తదుపరి సుప్రీం ఎంపికలో మా పాత్ర కూడా ఉండాలి. ఒక నాయకుడిని ఎంచుకున్న తర్వాత ఆ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తం. మరింత శక్తివంతంగా మార్చేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు సాయం చేస్తాయి. మొజ్తబా ఖమేనీని సుప్రీంగా మేం అంగీకరించం.
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
టెహ్రాన్‌లో మరో స్కూల్ పై దాడి..
టెహ్రాన్‌లోని నిలోఫర్ స్క్వేర్ వద్ద ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ శుక్రవారం ప్రకటించారు. టెహ్రాన్‌లోని 'షాహిద్ హమదానీ' పాఠశాల ధ్వంసమైన దృశ్యాలను ఆయన 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. ఈ దాడిలో జరిగిన ప్రాణనష్టంపై ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో పాఠశాలలపై దాడులు జరగడం ఇది నాలుగోసారి.
గత శనివారం దక్షిణ ఇరాన్‌లోని మీనాబ్ నగరంలో 'షజరే తయీబా' బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 160 మంది పిల్లలు, ఐదుగురు సిబ్బంది మరణించినట్లు యూఎన్ నిపుణులు ధృవీకరించారు. గురువారం కూడా టెహ్రాన్ నైరుతి దిశలో ఉన్న పరాండ్ పట్టణంలోని రెండు పాఠశాలలపై క్షిపణి దాడులు జరిగాయి. ఇప్పటివరకు ఇరాన్‌పై జరిగిన దాడుల్లో సుమారు 1,300 మంది మరణించగా, వారిలో కనీసం 181 మంది చిన్నారులు ఉన్నట్లు యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
12 గంటల్లో 900 మిసైళ్లు: ఇరాన్‌పై దాడులకు ఏఐ వాడిన ఇజ్రాయెల్, అమెరికా
వాషింగ్టన్: ఇరాన్ పై గత నెల 28న యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్, అమెరికా.. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో మొదటి రోజే బీభత్సం సృష్టించాయి. ఆరోజు 12 గంటల్లో 900 మిసైళ్లను ప్రయోగించాయి. ఈ దాడుల్లో కచ్చితత్వం కోసం ‘మావెన్ స్మార్ట్ సిస్టమ్ పాలంటిర్ మెషీన్ లెర్నింగ్’ ఏఐ టెక్నాలజీని ఉపయోగించాయి. దీంతో పెద్ద సంఖ్యలో మిసైళ్లను వేగంగా ప్రయోగించేందుకు వీలైంది.
ఇదే టెక్నాలజీతో అమెరికా ఆరు రోజుల్లో 2 వేలకుపైగా టార్గెట్లను పెట్టుకొని వెయ్యి మందిని చంపింది. ఏఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా డేటాను ఫిల్టర్ చేసి అనుకున్న లక్ష్యాలపై అటాక్ చేసి ఇరాన్ లో బీభత్సం సృష్టించింది. సైనికులు వేగంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఏఐ సాయపడుతోందని యూఎస్ సెంట్ కామ్ ప్రతినిధి కెప్టెన్ తిమోతీ హాకిన్స్ తెలిపారు.
ఏంటీ మావెన్?
మావెన్ స్మార్ట్ సిస్టమ్ ఒక కమాండ్ కంట్రోల్ టెక్నాలజీ. స్కార్లెట్ డ్రగన్ అనే 2017 పెంటగాన్ ప్రోగ్రామ్ లో మొదటిసారి దీనిని వాడారు. అమెరికా ఆర్మీకి చెందిన 18వ ఎయిర్ బార్న్ కోర్ దీనిని రూపొందించింది. శత్రువును, శత్రువు స్థావరాలను వెంటనే గుర్తించి, అంచనా వేసి, దాడిచేసి, నాశనం చేయడానికి ఈ టెక్నాలజీని యూఎస్ వాడుకుంటున్నది.
