ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులకు యూరియా టెన్షన్ .. యూరియా కొరత లేదంటున్న అధికారులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులకు యూరియా టెన్షన్ .. యూరియా కొరత లేదంటున్న అధికారులు
  • కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు.. ముందుగానే తెచ్చి నిల్వ చేసుకుంటున్న రైతులు 

భద్రాద్రికొత్తగూడెం/గుండాల, వెలుగు : వానాకాలం సీజన్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎరువుల కోసం టెన్షన్ పడుతున్నారు. ఒకవైపు సొసైటీలు, షాపుల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని అధికారులు చెబుతుండగా, మరోవైపు అన్నదాతలు మాత్రం ముందుగానే ఎరువులు తెచ్చి నిల్వ చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈనెలలోనే పంటల సాగు ఊపందుకోగా, మరో మూడు వారాల్లో వరినాట్లు మరింత స్పీడందుకునే ఛాన్సుంది. అప్పుడు యూరియా దొరకదేమోనన్న ఆందోళనతో ముందుగానే స్టాక్ తెచ్చుకునేందుకు పోటీపడుతున్నారు.  బహిరంగ మార్కెట్​లో అధిక ధరలకు అమ్ముతుండడంతో పాటు కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం సమస్యగా మారింది. 

ఎక్కడ.. ఎంత అవసరం..? 

  ఖమ్మం జిల్లాలో ఈ వానాకాలంలో 5.56 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారని అధికారులు అంచనా రూపొందించారు. ఇందులో ఇప్పటి వరకు 2.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 2.83 లక్షల ఎకరాల్లో వరి, 2.21లక్షల ఎకరాల్లో పత్తి, 71 వేల ఎకరాల్లో మిర్చి, 25 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్, 32 వేల ఎకరాల్లో మామిడి, 15 వేల ఎకరాల్లో పెసర, 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతుందని అంచనా వేశారు. వీటి కోసం 54,826 మెట్రిక్ టన్నుల యూరియా, 17,466 టన్నుల డీఏపీ, 13,766 టన్నుల ఎంఓపీ, 58,594 టన్నుల ఎన్పీకే, 44,84 టన్నుల ఎస్ఎస్పీ అవసరం అవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. జూలై వరకు 14,654 టన్నులు యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10359 మెట్రిక్ టన్నులు వచ్చింది.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సీజన్​కు 40,625 మెట్రిక్ టన్నుల యూరియా, 10,978 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,961 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులు 47,587 మెట్రిక్ టన్నులు, 4,457 మెట్రిక్ టన్నులు ఎస్ఎస్పీ అవసరం ఉంది. మొత్తంగా 1,08,608 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్​కు గానూ జూలై నెల వరకు 49,015 మెట్రిక్ టన్నులు వచ్చాయి. 

యూరియాను కొనేందుకే మొగ్గు 

ఎకరానికి ఒకటి నుంచి రెండు బస్తాల యూరియా మాత్రమే అవసరం ఉండగా రైతులు మాత్రం ఎకరానికి మూడు నుంచి నాలుగు బస్తాలకు పైగా యూరియాను వాడుతున్నారని అగ్రికల్చర్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ముందు ముందు యూరియా దొరుకుతుందో లేదోననే ఆందోళనలతో ముందస్తుగా కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్​పెట్టుకునేందుకు రైతులు ఇంట్రస్ట్ చూపుతున్నారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులు అవసరమైనప్పటికీ ప్రధానంగా రైతులు యూరియాను కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో మిర్చి సాగును తగ్గించి పత్తి సాగు పెరగడంతో కూడా యూరియా వినియోగం పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు రేటు పెంచి అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. యూరియా బస్తాను ఎమ్మార్పీ ధర రూ. 266కే అమ్మాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. 

ఎరువుల కొరత లేదు 

జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదు. యూరియాతో పాటు అవసరమైన ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉంచాం. రైతులు ఆందోళన చెందవద్దు. యూరియాను అధికంగా వాడడం వల్ల భూ సారం తగ్గుతుంది. పంట అవసరాలకు తగ్గుట్టుకు మాత్రమే ఫెర్టిలైజర్స్​ను వినియోగించాలి. 

బాబూరావు, డీఏవో, భద్రాద్రికొత్తగూడెం