
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో ఉన్న మన దేశ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా జులై 14న తిరిగి భూమికి రానున్నారు. ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి యాక్సియం మిషన్–4లో భాగంగా జూన్ 25న శుక్లా స్పేస్‌లోకి వెళ్లారు. 28 గంటల తర్వాత వారు ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించారు. అప్పటినుంచే అక్కడే ఉన్న ఈ నలుగురు ఈ నెల 14న ఉదయం తిరుగు పయనమవుతారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం ప్రకటించింది.
నిజానికి ఆస్ట్రోనాట్లు ఈ నెల10న స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరతారని తొలుత ప్రకటించిన నాసా తాజాగా కొంత ఆలస్యంగా రిటర్న్ అవుతారని వెల్లడించింది. కాగా, రెండువారాలుగా ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఆస్ట్రోనాట్లు ఇప్పటివరకు రోజుకు దాదాపు 16 చొప్పున 230 సూర్యోదయాలు చూశారు. భూమి చుట్టూ 224 సార్లు చక్కర్లు కొట్టారు.