- ఐఐఎస్ ట్రైనీ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన
న్యూఢిల్లీ, వెలుగు: దేశ భద్రత, సంక్షోభ సమయాల్లో తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టించే శక్తులను ఎదుర్కొనేందుకు సమయోచితంగా, వాస్తవాధారంగా ప్రజలకు సమాచారం చేరవేయడంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారుల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఐఐఎస్ అధికారులు కేవలం సమాచార మాధ్యమకారులుగానే కాకుండా సమాచార సమగ్రతకు, జాతీయ ఐక్యతకు పరిరక్షకులుగా నిలవాలని సూచించారు. యుద్ధం చేయకుండా సమాచార వ్యాప్తి ద్వారా శత్రువుల మనోభావాలను ప్రభావితం చేసే ‘సైకాలజికల్ ఆపరేషన్స్’లో టీవీ, రేడియోతో పాటు మీడియా కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
బలాన్ని కాకుండా మేధస్సును ఉపయోగించే సమాచార యుద్ధంలో ఐఐఎస్ అధికారులు అగ్రభాగాన నిలవాలని ఆయన కోరారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 2009, 2023, 2024 బ్యాచ్‌లకు చెందిన గ్రూప్-ఏ ట్రైనీ అధికారులు ఈనెల 15 నుంచి 22 వరకు అంతర్గత భద్రత, సంక్షోభ-విపత్తు కమ్యూనికేషన్, సైకాలజికల్ ఆపరేషన్స్ అంశాలపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో ట్రైనీ అధికారులు కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, హోంశాఖ మీడియా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ రాజ్‌కుమార్, ఐఐఎస్ కోర్సు డైరెక్టర్ రష్మీ రోజా తుషార నాయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయన్న అంశాలపై మంత్రి ఆరా తీశారు. అణగారిన వర్గాలకు సంక్షేమ ఫలాలు చేరేందుకు చేపట్టాల్సిన చర్యలు, మారుమూల గ్రామాలకూ సమాచార ప్రసారం బలోపేతం చేసే మార్గాలపై అధికారులతో చర్చించారు.
