న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల ఆంక్షలపై వచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్వీకరించింది. విద్యార్థులు నలుగురికి మించి గ్రూపులుగా తిరగవద్దని, ముందస్తు అనుమతి లేకుండా సెమినార్లు, కాన్ఫరెన్లు నిర్వహించకూడదని తెలిపుతూ ఢిల్లీ వర్సిటీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నాలు, నిరసనలపై కూడా పూర్తి స్థాయిలో నిషేధం విధించింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... ఢిల్లీ వర్సిటీ లా స్టూడెంట్ సభావట్ కల్యాణ్ మంగళవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషన్... సంబంధిత అధికార సంస్థకు కేసును బదిలీ చేసి, 8 వారాల లోపు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే, ఈ ప్రక్రియలో ఫిర్యాదుదారుడు/బాధితుడికి భాగస్వామ్యం కల్పించి, తీసుకున్న చర్యలపై సమాచారం అందించాలని సూచించింది.
