లేఆఫ్స్ వేళ ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ నియామకం.. ఏడాదికి రూ.31 కోట్ల జీతం

లేఆఫ్స్ వేళ ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ నియామకం.. ఏడాదికి రూ.31 కోట్ల జీతం

అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ ప్రస్తుతం ఒకవైపు లేఆఫ్స్ కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యూహాత్మక నియామకాలతో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిన జస్ట్ వారం రోజుల వ్యవధిలోనే.. కంపెనీ కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO)గా హిల్లరీ మాక్సన్‌ను నియమించడం కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మార్చి 31న తెల్లవారుజామున 6 గంటలకు పంపిన ఒకే ఒక్క ఈమెయిల్‌తో వేలాది మంది కెరీర్‌ను ముగించిన ఒరాకిల్.. ఇప్పుడు AI, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అగ్ర సంస్థగా ఎదిగేందుకు తన ఆర్థిక పగ్గాలను సమర్థురాలైన నాయకురాలికి అప్పగించింది.

కొత్త సీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టిన హిల్లరీ మాక్సన్‌కు ఎనర్జీ మెయింటెనెన్స్ అండ్ ఆటోమేషన్ రంగంలో అనుభవం కలిగి ఉన్నారు. గతంలో ఆమె షనైడర్ ఎలక్ట్రిక్ వంటి దిగ్గజ సంస్థలో గ్రూప్ సీఎఫ్ఓగా పనిచేశారు. ఒరాకిల్ ప్రస్తుతం డేటా సెంటర్ల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో.. మౌలిక సదుపాయాల రంగంలో అనుభవం ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం వెనుక బలమైన వ్యూహం కనిపిస్తోంది. శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని OpenAI వంటి సంస్థల ఏఐ అవసరాలను తీర్చడానికి ఒరాకిల్ భారీ స్థాయిలో డేటా సెంటర్లను నిర్మిస్తోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలకు పోటీగా క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్‌ను బలోపేతం చేయడమే హిల్లరీ ముందున్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.

ఏఐ మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న విపరీతమైన ఖర్చు వల్ల ఒరాకిల్ ప్రస్తుతం నగదు కొరతను ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే సుమారు 30వేల మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో అవసరం ఉండదు అనుకునే విభాగాలపైనే ఈ వేటు పడుతోంది. ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ హిల్లరీకి ఏడాదికి 9.5 లక్షల డాలర్ల(రూ.8 కోట్ల 55 లక్షలు) శాలరీతో పాటు, పనితీరు ఆధారంగా 25 లక్షల డాలర్ల(రూ.23 కోట్లు) బోనస్ ప్యాకేజీని టెక్ దిగ్గజం ఆఫర్ చేసింది. ఏది ఏమైనా.. ఉద్యోగుల తొలగింపుతో ఆవేదనలో ఉన్న వేళ, కొత్త మేనేజ్మెంట్ ఏఐ ఫోకస్‌తో ఒరాకిల్ తన భవిష్యత్తును ఎలా మలుచుకుంటుందో వేచి చూడాల్సిందే.