మామిడి పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి.. తియ్యటి, పుల్లటి రుచి రమ్మని పిలుస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా! అని నోరూరుతుంది. మామిడి సీజన్ మొదలైపోయింది. అందుకే ఈ వారం పచ్చి మామిడి స్పెషల్ రెసిపీస్ మీకోసం.
ఐస్ క్రీం
కావాల్సినవి: పచ్చి మామిడికాయ - ఒకటి
క్రీమ్ : - రెండు వందల మిల్లీ లీటర్లు కండెన్సడ్
మిల్క్ -: 200 మిల్లీ లీటర్లు
చక్కెర -: 75 గ్రా.
తయారీ
మామిడి కాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పానీలో ముక్కల్ని ఉడికించాలి. ముక్క మెత్తబడ్డాక చక్కెర కలపాలి. దీన్ని గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బాలి. ఒక గిన్నెలో క్రీమ్, కండెన్సడ్ మిల్క్, మామిడి మిశ్రమం కూడా వేసి ఇవన్నీ కలిసేటట్టు కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. నాలుగు గంటల తర్వాత ఫ్రిజ్ నుంచి బయటకు తీస్తే యమ్మీ, యమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.
మ్యాంగో ఫ్రై
కావాల్సినవి
మామిడి కాయ ముక్కలు -ఒక కప్పు
పోపు దినుసులు-- ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు-- ఒక టీ స్పూన్
ఎండుమిర్చి- రెండు
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు- రెండు రెమ్మలు
గరంమసాలా- ఒక టీ స్పూన్
ఉప్పు, కారం- తగినంత
పసుపు- చిటికెడు
ఇంగువ - చిటికెడు
నూనె-- మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డ తరుగు -
అరటేబుల్ స్పూన్
తయారీ
పాన్ లో నూనె వేడిచేసి పోవుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, పసుపు, ఇంగువ వేసి వేగించాలి. అందులో మామిడికాయ ముక్కలు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. తర్వాత కారం, గరం మసాలా వేసి మరికాసేపు వేగించాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసు కుంటే నోరూరించే మామిడి ఫ్రై రెడీ.
