చట్టం కంటే గంధమల్ల'కు ఎక్కువ పరిహారం ఫిక్స్ .. ఒప్పించి.. మెప్పించిన ఆఫీసర్లు

చట్టం కంటే గంధమల్ల'కు ఎక్కువ పరిహారం ఫిక్స్ .. ఒప్పించి.. మెప్పించిన ఆఫీసర్లు
  • 'ఎకరానికి రూ.24.50 లక్షలు
  • రైతులతో పలుమార్లు చర్చలు
  • ప్రారంభమైన భూ సర్వే

యాదాద్రి, వెలుగు : గంధమల్ల రిజర్వాయర్​నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపు కొలిక్కి వచ్చింది. 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న దాని కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. మరికొంత పెంచాలని రైతులు కోరగా, రిజర్వాయర్​నిర్మాణంతో కలిగే లబ్ధిని వివరించి వారిని మెప్పించి.. ఒప్పించారు. చివరకు రైతులు అంగీకరించారు. 

బండ్​ కోసం 1000 ఎకరాలు..

ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు గంధమల్ల రిజర్వాయర్​నిర్మించాలని దశాబ్దకాలంగా డిమాండ్​వస్తోంది. అయితే అప్పటి సీఎం కేసీఆర్​2018 ఎన్నికల ముందు గంధమల్ల రిజర్వాయర్​ నిర్మిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని గురించి మరిచిపోయింది. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే గంధమల్ల రిజర్వాయర్​పై ఫోకస్​ పెట్టింది. భూసేకరణ తక్కువగా ఉండే విధంగా ప్లాన్​ చేసి, 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్​ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. బండ్​ నిర్మాణం కోసం వెయ్యి ఎకరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, మిగిలిన 950 ఎకరాలను 2,500 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. 

చట్టంలో పేర్కొన్న దాని కంటే ఎక్కువ పరిహారం..

భూ సేకరణ విషయంలో రైతులతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే​ బీర్ల ఐలయ్య, కలెక్టర్​ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్​వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి సహా ఇతర ఆఫీసర్లు చర్చలు జరిపారు. అంతకుముందు రైతులతో ఆఫీసర్లు పలుమార్లు చర్చలు జరిపారు. ఎకరానికి రూ.40 లక్షల చొప్పున పరిహారం కావాలని రైతులు మొదట్లో కోరారు. ఆ తర్వాత రూ.30 లక్షలు ఇప్పించాలని అడిగారు. అయితే తాజాగా జరిపిన చర్చల్లో 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని అధికారులు ప్రకటించారు. 

రిజర్వాయర్ కోసం సేకరించే భూమికి ఎకరానికి రూ.3.50 లక్షల నుంచి రూ. 3.90 లక్షల వరకు ఉంది. ఈ లెక్కన ఎకరానికి మూడింతల పరిహారం అంటే రూ.11.75 లక్షల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో చర్చించిన ఆఫీసర్లు.. ఎకరం భూమికి రూ.24.50 లక్షలు ఇప్పిస్తామని మీటింగ్​లో హామీ ఇచ్చారు. మీటింగ్​కు వచ్చిన రైతులు ఈ నిర్ణయంపై కొంతసేపు తర్జనభర్జనలు పడి.. మరికొంత ఎక్కువ ఇప్పించాలని కోరారు. అయితే ఆఫీసర్లు వారిని ఒప్పించి.. చివరకు మెప్పించారు. దీంతో రైతులు అంగీకరించారు. సర్వే చేయడానికి కూడా ఒప్పుకున్నారు. 

సర్వే నిర్వహించిన ఆఫీసర్లు..

సేకరించే భూమికి పరిహారం ఫిక్స్ చేయగానే ఇరిగేషన్​, రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. గంధమల్ల రిజర్వాయర్​కోసం సేకరించే భూములను శుక్రవారం సర్వే చేశారు. త్వరలో రైతుల వారీగా సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ఒక్కో రైతు నుంచి సేకరించే భూమిని సర్వే నంబర్ల వారీగా గుర్తిస్తామని తెలిపారు.