T20 World Cup: బెన్ మనేంటి వీరోచిత పోరాటం వృథా: ఇంగ్లాండ్‎పై పోరాడి ఓడిన ఇటలీ

T20 World Cup: బెన్ మనేంటి వీరోచిత పోరాటం వృథా: ఇంగ్లాండ్‎పై పోరాడి ఓడిన ఇటలీ

కోల్‎కతా: టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లాండ్‎తో జరిగిన మ్యాచులో పసికూన ఇటలీ పోరాడి ఓడింది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేధనలో చివరి బంతి వరకు పోరాడి ఇంగ్లాండ్‎ను వణికించింది. ఇటలీ స్టార్ ప్లేయర్ బెన్ మనేంటి (25 బంతుల్లో 60 పరుగులు) వీరోచితంగా పోరాడాడు. చివరకు ఈ మ్యాచులో ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లాండ్ సూపర్ 8కు అర్హత సాధించింది. 

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాల్ట్ (28), బెథేల్ (23), సామ్ కరన్ (25), బాంటన్ (30) ఫర్వాలేదనిపించారు. చివర్లో విల్ జాక్స్ (53) మెరుపు హాఫ్ సెంచరీతో రెచ్చిపోయి ఇంగ్లాండ్‎కు భారీ స్కోర్ అందించాడు. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కలుగమగే, గ్రాంట్ స్టీవర్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ మానేంటి, జేజే స్మట్స్, అలీ హసన్ తలో వికెట్ పడగొట్టారు. 

అనంతరం 203 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగిన ఇటలీ 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారీ టార్గె్ట్ ముందున్న ఇటలీ బెదరలేదు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపుకు సాగింది. ముఖ్యంగా బెన్ మానేంటి ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 

కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 60 పరుగులు చేసి ఇటలీ గెలుపు కోసం తీవ్రంగా పోరాడాడు. మానేంటి ఔటైన తర్వాత గ్రాంట్ స్టీవర్ట్ చెలరేగి ఆడాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి 45 పరుగులు చేశాడు.

 స్టీవర్ట్ దూకుడుతో ఇటలీ గెలిచేలా కనిపించింది. కానీ భారీ షాట్ ఆడే క్రమంలో సామ్ కరాన్ బౌలింగ్‎లో క్యా్చ్ ఔట్ అయ్యాడు. దీంతో ఇటలీ పోరాటం ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్, సామ్ కరాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఆర్చర్ 2, విల్ జాక్స్, రషీద్ చెరో వికెట్ తీశారు.