నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు భారీ ఊరట .. బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు!

నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు భారీ ఊరట .. బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు!

అప్పుల ఊబిలో కూరుకుపోయి జైలు పాలైన బాలీవుడ్ కామెడీ కింగ్ రాజ్ పాల్ యాదవ్ కు ఢిల్లీ హైకోర్టులో భారీ  ఊరట లభించింది. దాదాపు రూ. 9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. మార్చి 18న జరిగే తదుపరి విచారణకు  హాజరు కావాలి ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదు హెచ్చరించింది.

అప్పుల ఊబిలో ..

బాలీవుడ్ వెండితెరపై తనదైన మేనరిజమ్స్ తో కోట్ల మంది ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు నటుడు రాజ్ పాల్ యాదవ్. 'చుప్ చుప్ కే', 'హంగామా' వంటి చిత్రాలతో కామెడీ కింగ్‌గా గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన.. గత కొద్దిరోజులుగా తీహార్  జైలు గదుల్లో గడపాల్సి వచ్చింది.2012లో ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'అటా పటా లాపతా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా నిర్మాణం కోసం ఆయన చేసిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. 

దీంతో మొదట రూ. 5 కోట్లుగా ఉన్న అసలు, వడ్డీలు , జరిమానాలతో కలిపి ఏకంగా రూ. 9 కోట్లకు చేరింది. అప్పు తీర్చడానికి ఆయన ఇచ్చిన చెక్కులు వరుసగా బౌన్స్ కావడంతో 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్' కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కోర్టుకు ఇచ్చిన హామీలను పదే పదే ఉల్లంఘించడంతో డిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. 2026 ఫిబ్రవరి 4వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి 5న ఆయన తిహార్ జైలులో లొంగిపోవాల్సి వచ్చింది..

తోడుగా బాలీవుడ్ పెద్దన్నలు

రాజ్‌పాల్ యాదవ్ జైలు పాలవ్వడంతో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా కదిలింది. సహనటుడి కష్టాన్ని చూసి దిగ్గజ హీరోలు, దర్శకులు ఆర్థికంగా అండగా నిలిచారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, సోనూ సూద్ లు ముందుండి రాజ్‌పాల్ యాదవ్‌ను గట్టెక్కించేందుకు భారీ ఆర్థిక సాయం అందించారు. కామెడీ సినిమాలతో తమకు ఎన్నో విజయాలనందించిన నటుడి కోసం డేవిడ్ ధావన్, వరుణ్ ధావన్ స్పందించారు. మీకా సింగ్, గురు రంధావా, అనూప్ జలోటా, బాక్సర్ విజేందర్ సింగ్, రాజకీయ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తమ వంతు సహాయాన్ని ప్రకటించారు.

షరతులతో బెయిల్..

మొత్తం రూ. 9 కోట్ల అప్పులో రాజ్‌పాల్ యాదవ్ ఇప్పటివరకు రూ. 2.5 కోట్లు డిపాజిట్ చేశారు. గతంలో రూ. 75 లక్షలు చెల్లించగా లేటెస్ట్ గా రూ. 1.75 కోట్లు జమ చేయడంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తన పాస్‌పోర్టును అప్పగించడంతో పాటు .. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదు తీర్పు ఇచ్చింది. మార్చి 18న జరిగే తదుపరి విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.. రాజ్‌పాల్ యాదవ్ బయటకు వస్తున్నారనే వార్త తెలియగానే ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.