పార్లమెంట్ పక్కనే అమ్మాయిలతో ఇంత ఘోరం చేస్తుంటే.. యంగ్ ఎంపీ స్వాతి సంచలన వివరాలు

పార్లమెంట్ పక్కనే అమ్మాయిలతో ఇంత ఘోరం చేస్తుంటే.. యంగ్ ఎంపీ స్వాతి సంచలన వివరాలు

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 16) ఆమె రాజ్య సభలో మాట్లాడుతూ.. దేశ ఆత్మగా అభివర్ణించే భారత పార్లమెంటుకు కేవలం 3 కి.మీ దూరంలోని జీబీ రోడ్డులో 90కి పైగా వ్యభిచార గృహాలు ఉన్నాయని.. ఇక్కడ రోజుకు దాదాపు 5 వేల మంది మహిళలు లైంగిక దోపిడికి గురైతున్నారని అన్నారు. 

మైనర్ బాలికలను కూడా బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‎గా పని చేసినప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి అనేక మంది మైనర్ బాలికలను రక్షించారని ఆమె గుర్తు చేశారు. అండర్ గ్రౌండ్‎లో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహం నుంచి ఒక అమ్మాయిని రక్షించామని.. ఆ అమ్మాయిని చూస్తే 32 ఏళ్ల మహిళాలా కనిపించింది. కానీ బోన్ టెస్ట్‎లో ఆ అమ్మాయి వయస్సు 14 ఏళ్లుగా తేలిందని దిగ్భ్రాంతికరమైన విషయం చెప్పారు. 

బాలికను తొమ్మిదేళ్ల వయసులో అమ్మేశారని.. ప్రతిరోజూ ఆక్సిటోసిన్ ఇంజెక్ట్ చేయడంతో అమ్మాయి శరీర భాగాలు త్వరగా పరిణితి చెందాయని పేర్కొన్నారు. పార్లమెంట్‎కు కూతవేటు దూరంలో వ్యభిచార ముఠాలు ఇలా బరితెగించి మైనర్ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీఆర్బీ డేటాను ఉటంకిస్తూ.. ఇండియాలో రోజుకు 90కి పైగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయని స్వాతి మలివాల్ పేర్కొన్నారు.

 ఒక్క 2023లోనే 1.77 లక్షలకు పైగా పోక్సో కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పోక్సో కేసుల్లో కేవలం 14.3 శాతం మాత్రమే శిక్ష విధించబడుతోందని తెలిపారు. పోక్సో కేసుల్లో వేగంగా తీర్పు ఇవ్వడం అవసరమని ఆమె పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, మెరుగైన ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

అలాగే.. వ్యభిచార కేంద్రాలుగా పనిచేస్తున్న స్పాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత విలాసం కాదని.. అది ఒక ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. పార్లమెంటుకు కూతవేటు దూరంలో మైనర్ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారంటూ ఏకంగా రాజ్య సభలో స్వాతి మలివాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

దేశ ఆత్మగా అభివర్ణించే భారత పార్లమెంటుకు కేవలం 3 కిలో మీటర్ల దూరంగా ఇంత నీచమైన పనులు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహిళలా రక్షణే తమ తొలి ప్రాధాన్యత అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈ ఘోరం కనబడటం లేదా అని విమర్శిస్తున్నారు.