ఈరోజు సోమవారం (ఫిబ్రవరి 16) ఢిల్లీలోని GTB నగర్‌లో జరిగిన పోలీస్ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ భద్రతను పెంచడానికి సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌తో సహా 10 కొత్త పథకాలను ప్రారంభించారు. ఢిల్లీని సురక్షితమైన నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్లాన్‌లో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో 'ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్' ఇకపై అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది.
ఢిల్లీ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయడానికి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే 2 వేల 100 కొత్త కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే రానున్న రోజుల్లో 'సేఫ్ సిటీ' ప్రాజెక్ట్ కింద మొత్తం 10 వేల కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న 15వేల కెమెరాలకి ఇవి అదనం.
2014 కంటే ముందు కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టు ప్రాంతాల్లో ఉన్న సమస్యలను 80% వరకు తగ్గించగలిగామని ఆయన చెప్పారు. దేశాన్ని మావోయిస్టు ముప్పు నుంచి పూర్తిగా విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పార్లమెంట్ దాడి, ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్ల వంటి కఠినమైన కేసులను ఛేదించినందుకు ఢిల్లీ పోలీసులను అభినందించారు.
నేరం చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడేలా మన దేశ చట్టాలను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ప్రస్తుతం ఉన్న శిక్షల రేటును 75% నుండి 80% కి పెంచడమే లక్ష్యం. అస్సాం, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నేరస్తులకు శిక్షలు పడే శాతం 20% వరకు పెరిగిందని ఆయన ఉదాహరణగా చెప్పారు.
ఢిల్లీ పోలీస్ ఆవిర్భావ దినోత్సవం అంటే ఏమిటి?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 16న ఈ వేడుక జరుపుకుంటారు. 1948లో ఇదే రోజున ఢిల్లీ పోలీస్ వ్యవస్థ పంజాబ్ నుండి విడిపోయి, ఒక స్వతంత్ర విభాగంగా ఏర్పడింది.
