
న్యూఢిల్లీ: ఏపీ కేడర్ ఐపీఎస్ సిద్ధార్థ్‌కౌశల్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్ధార్థ్‌కౌశల్ రాజీనామాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2025, జూలై 11న కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్దార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2025, జూలై 2న రాజీనామా లేఖ విడుదల చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నానని.. నా రాజీనామా వెనక ఎలాంటి బలవంతం, రాజకీయ వేధింపులు లేవని స్పష్టం చేశారు సిద్దార్థ్ కౌశల్. దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు, నా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులతో రాజీనామా చేస్తోన్నట్లు వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవన్నారు సిద్దార్థ్ కౌశల్.
ఐపీఎస్‌గా సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇచ్చిందని.. ఇది నా జీవితంలో ఓ అద్భుత ప్రయాణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నా సొంత ఇల్లుగా భావించానని.. ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ హృదయంలో నిలిచి ఉంటాయన్నారు కౌశల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నా సీనియర్లకు, సహోద్యోగులకు, జూనియర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. మీ మద్దతు, నమ్మకం నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కొత్త మార్గాల్లో సమాజానికి సేవ చేస్తానన్నారు.
కాగా, గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన సిద్దార్థ్ కౌశల్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత వైసీపీ సర్కార్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో అంటకాగారనే ఆరోపణలపై కూటమి ప్రభుత్వం సిద్దార్థ్ కౌశల్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది.
ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా విధులు నిర్విర్తిస్తున్న సిద్దార్థ్ కౌశల్.. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ రాజకీయ వేధింపుల వల్లే ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. దీంతో సిద్దార్థ్ కౌశల్ వీఆర్ఎస్ వ్యవహారం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.