నిజామాబాద్ జిల్లాలోని కాలేజీలకు కొత్తరూపు .. 14 జూనియర్కాలేజీల రిపేర్లకు రూ.3.23 కోట్లు మంజూరు

నిజామాబాద్ జిల్లాలోని కాలేజీలకు కొత్తరూపు .. 14 జూనియర్కాలేజీల రిపేర్లకు రూ.3.23 కోట్లు మంజూరు
  • నిజామాబాద్​జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన జూనియర్ కాలేజీలు
  • పట్టించుకోని గత బీఆర్ఎస్​ సర్కార్​
  • విరిగిన కుర్చీలు, బెంచీలు, కంపుకొడుతున్న వాష్ రూమ్స్, ఉరుస్తున్న తరగతి గదులతో విద్యార్థుల అవస్థలు
  • నిధుల మంజూరుతో తొలగనున్న ఇబ్బందులు
  • చేపట్టనున్న రిపేర్లు, కనీస వసతుల కల్పన   

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని జూనియర్ కాలేజీలకు 11 ఏండ్ల తర్వాత నిధులు మంజూరయ్యాయి. 14 కాలేజీలలో రిపేర్లు, వసతుల కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.23 కోట్లు మంజూరు చేసింది.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. ఏండ్ల తరబడి కాలేజీ భవనాలకు పేయింటింగ్ వేయక గోడలు పాకురుపట్టాయి. తరగతి గదుల రేకులు పగిలి ఉరుస్తున్నాయి. విరిగిన బెంచీలు, రిపేర్లకు నోచుకోని తాగునీటి నల్లాలు గత సర్కార్ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షాలుగా నిలుస్తున్నాయి.

 కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కళాశాలల భవనాల రూపురేఖలు మారనున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పది రోజుల్లో టెండర్లు పూర్తి చేసి, నెలలోనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల ప్రక్రియ ముగియగానే ఇంటర్ బోర్డు నుంచి నిధులను పీఆర్ శాఖకు బదిలీ చేసి పనులు త్వరగా పూర్తయ్యే జిల్లాయంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. 

2014 తర్వాత నో రిపేర్లు..

ఉమ్మడి రాష్ట్రంలో జూనియర్​ కాలేజీలకు మరమ్మతులు జరిగాయి. 2014 తర్వాత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాలేజీల వైపు కన్నెత్తి చూడలేదు. నయాపైసా మంజూరు చేయలేదు. సమస్యలు పేరుకుపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని కాలేజీల్లో లెక్చరర్లు, స్టాఫ్ చందాలు వేసుకొని బెంచీలు, టేబుళ్లను రిపేర్ చేయించుకున్నారు. వాష్​రూమ్స్​లో బేసిన్లు విరిగిపోయి కంపుకొడుతుండడంతో విద్యార్థులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. 

జిల్లాలో 16 జూనియర్​ కాలేజీలు..

జిల్లాలో 16  ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. బోధన్ మధుమలాంచ జూనియర్ కాలేజీ, కమ్మర్​పల్లి మండలంలోని కాలేజీ స్కూళ్లలో కొనసాగుతుండగా, మిగిలిన14 కాలేజీలకు కాంగ్రెస్ సర్కార్ ఈ నెల 4న రూ.3.23 కోట్లు మంజూరు చేసింది. 16 కాలేజీల్లో ఫస్ట్ ఇయర్​లో 4,205 మంది, సెకండ్ ఇయర్​లో 3,864 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకేషనల్ కోర్సులో 600 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో గర్ల్ 61 శాతం ఉన్నారు. 

నగరంలోని కాలేజీల్లో తీరనున్న కష్టాలు..

నిజామాబాద్ నగరంలోని గోల్​హనుమాన్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో 1,150 స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు, ఇంగ్లిష్​, ఉర్దూ మీడియాల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ ఈసీ గ్రూపులు నడుస్తున్నాయి. ఒకేషనల్ విద్యార్థులు మరో 400 మంది ఉన్నారు. పాతబడిన కరెంట్ వైరింగ్,​ కూర్చోడానికి సరైన బెంచీలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మంజూరైన రూ.30 లక్షలతో సమస్యలు తీరనున్నాయి.  ఖిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ 50 ఏండ్ల కిందట ప్రారంభం అయ్యింది. 

ఈ కాలేజీ ఎంతో మంది మెరికలను సమాజానికి అందించింది. వెయ్యి మంది విద్యార్థులున్న కాలేజీ పైకప్పు రేకులు పగిలి వానాకాలంలో ఉరుస్తున్నాయి. 20 ఏండ్లు దాటిన కరెంట్ వైర్ల కారణంగా గతేడాది షార్ట్​సర్క్యూట్​తో రికార్డులు కాలిపోయాయి. శిథిలమైన బీరువాలు, ఫర్నిచర్ లేక ఆధ్వానంగా తయారైంది. రూ.56 లక్షల నిధులు మంజూరు కాగా, రిపేర్లు, వసతులు కల్పించనుండడంతో కాలేజీ రూపు మారనుంది. 

ఇంటర్ విద్య బలోపేతం 

ఎన్నో ఏండ్ల తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు నిధులు మంజూరయ్యాయి.  ఇంటర్​ విద్య బలోపేతం కానుంది. వసతులు ఉంటే అడ్మిషన్లు పెరుగుతాయి. రిపేర్లు, కలరింగ్ సహా వాష్​రూమ్స్​, వాటర్ ఫెసిలిటీ, బెంచీలు, బ్లాక్ బోర్డ్స్, ఫర్నిచర్ తదితర వాటిని సమకూరుస్తాం. పనులు వేగంగా పూర్తయ్యేలా చూస్తాం

తిరుమలపూడి రవికుమార్​, డీఐఈవో 

నిధుల మంజూరు ఇలా..

జూనియర్​కాలేజీ    నిధులు 
నిజామాబాద్ ఖిల్లా (బాయ్స్) రూ.56 లక్షలు
నిజామాబాద్​(గర్ల్స్)      రూ.30 లక్షలు
డిచ్ పల్లి    రూ.14 లక్షలు
మాక్లూర్     రూ.10 లక్షలు
మోర్తాడ్    రూ.26.35 లక్షలు
వర్ని    రూ.20.50 లక్షలు
బోధన్    రూ.10.70 లక్షలు
ఆర్మూర్ గర్ల్స్    రూ.16 లక్షలు
ఆర్మూర్ బాయ్స్​    రూ.24 లక్షలు
భీంగల్     రూ. 18 లక్షలు
అయిలాపూర్    రూ.9 లక్షలు
బాల్కొండ    రూ.33.05 లక్షలు
ధర్పల్లి    రూ.25 లక్షలు
కోటగిరి    రూ.30.50 లక్షలు