
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా నిల్చిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రిపోర్టులో ప్రమాదానికి దారితీసిన సాంకేతిక సంఘటనలు, కాక్‌పిట్ సంభాషణలను ఏఏఐబీ వెల్లడించింది.
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన మూడు సెకన్లకే ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ల వ్యవధిలోనే రన్ మోడ్ నుంచి కటాఫ్ మోడ్‌కు మారాయి.. ఫ్యూయెల్ స్విచ్‌లు ఒకేసారి షట్ డౌన్ కావడంతో ఫ్లైట్‌కు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో ఫ్లైట్ గాల్లోనే థ్రస్ట్ కోల్పోయి రెండు ఇంజిన్లు ఆగిపోయాయని తెలిపింది ఏఏఐబీ. వెంటనే అప్రమత్తమైన ఓ పైలట్.. ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‌లు ఎందుకు కటాఫ్ చేశావని ప్రశ్నించగా.. మరొక పైలట్ ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‌లు తాను ఆఫ్ చేయలేదని బదులిచ్చినట్లు కాక్ పిట్ వాయిస్ రికార్డ్‌లో రికార్డ్ అయ్యిందని వెల్లడించింది ఏఏఐబీ.
ఇవే పైలట్లు చివరి మాటలని తెలిపింది. రెండు ఇంజన్లు ఒకేసారి థ్రస్ట్ కోల్పోయే ముందు విమానం గరిష్టంగా 180 నాట్ల వేగాన్ని చేరుకుంది కానీ ఇంధన స్విచ్‌లు సెకన్ల వ్యవధిలో కటాఫ్ కావడంతో వెంటనే వేగం, ఎత్తు డౌన్ అయ్యిందని తెలిపింది. టేకాఫ్ అయిన వెంటనే విమాన రామ్ ఎయిర్ టర్బైన్ లిఫ్ట్ (RAT) బయటకు వచ్చిందని.. రెండు ఇంజిన్ల స్విచ్‌లను తిరిగి రన్‌లో ఉంచారని తెలిపారు.
దీంతో ఇంజిన్-1లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని, ఇంజిన్-2 స్టార్ట్ అయినా.. పవర్ అందుకోలేదు. అప్రమత్తమైన పైలట్లు 1.39 గంటలకు ఏటీసీ మేడే సందేశం పంపారు. ఎయిర్ ఇండియా పైలట్ మేడే కాల్‌కు ఏటీసీ రెస్పాండ్ అయ్యింది. కానీ ఫైలట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే విమానం క్రాష్ అయ్యిందని ఏఏఐబీ తన ప్రాథమిక రిపోర్టులో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను వెల్లడించింది.
ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోల పరిశీలన పూర్తి అయ్యిందని పేర్కొంది ఏఏఐబీ. ప్రమాదం తర్వాత ఘటన స్థలం నుంచి విమానం రెండు ఇంజన్లను వెలికి తీసినట్లు తెలిపింది. తదుపరి పరీక్షలకు కంపోనెట్స్ గుర్తించి ఇంజిన్లను భద్రపరిచినట్లు స్పష్టం చేసింది. ప్రమాదానికి ముందు విమానం ఇంధనం, బరువు సైతం పరిమితంగానే ఉన్నాయని.. ఫ్లైట్‌లో ప్రమాదకర వస్తువులు ఏవి లేవని తెలిపింది. విమాన ఫ్యూయెల్ లో కల్తీ కూడా ఏమి జరగలేదని వెల్లడించింది. విమానాన్ని పక్షి ఢీకొట్టినట్లు సీసీ కెమెరాల్లో ఎక్కడ కనిపించలేదని పేర్కొంది.
కాగా, 2025, జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే జనవాసాల మధ్య కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది మృతి చెందగా.. మెడికల్ కాలేజీ భవనంపై ఫ్లైట్ కుప్పకూలడంతో అందులోని కొందరు మరణించారు.