కిట్టీ పార్టీల్లో స్నేహం.. 20 మందికి రూ.30 కోట్ల టోకరా .. బెంగళూరులో మహిళ అరెస్టు

కిట్టీ పార్టీల్లో స్నేహం.. 20 మందికి రూ.30 కోట్ల టోకరా .. బెంగళూరులో మహిళ అరెస్టు

బెంగళూరు: కిట్టీ పార్టీల్లో పలువురితో స్నేహం చేసుకుని 20 మందికి రూ.30 కోట్లకు టోకరా పెట్టిన మహిళను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని సవితగా గుర్తించారు. కిట్టీ పార్టీల్లో కొంతమంది మహిళలతో ఆమె స్నేహం చేసుకుంది. క్రమంగా వారి నమ్మకాన్ని చూరగొంది. తనకు సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి ఎంబీ పాటిల్ వంటి ప్రముఖులు తెలుసని మహిళలను నమ్మించింది. పలు స్కీమ్స్ లో పెట్టుబడులు పెడితే, భారీగా లాభాలు వస్తాయని ఆశపెట్టింది. అమెరికా నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానని నమ్మించింది. ఇలా 20 మంది మహిళల వద్ద సవిత రూ.30 కోట్లు సేకరించింది. బాధితులు ఒక్కొక్కరు రూ.50 లక్షల నుంచి రూ.2.5 కోట్ల వరకు చెల్లించారు. అయితే, ఎన్నిరోజులైనా డబ్బు రాకపోవడంతో కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో గోవిందరాజనగర పోలీసులు సవితను అరెస్టు చేశారు. తర్వాత ఆమె బెయిల్​పై రిలీజయ్యాక మళ్లీ అవే పనులు చేసింది. దీంతో మాజీ టీచర్  కుసుమ అనే బాధితురాలు బసవేశ్వరనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సవితను పోలీసులు అరెస్టు చేశారు. సవితకు రెండేండ్లలో పలు దఫాల్లో తాను రూ.95 లక్షలు చెల్లించానని, కానీ ఆమె చెప్పినట్లు రిటర్నులు రాలేదని కుసుమ ఆరోపించింది. ‘‘సవితపై నమ్మకంతో ఎలాంటి లీగల్ డాక్యుమెంట్లు లేకుండానే డబ్బులు చెల్లించాను. ఎంతకీ నా డబ్బు తిరిగి రాకపోవడంతో సవితను నిలదీశాను. ‘డబ్బుల కోసం మళ్లీ నా ఇంటికి వస్తే, నీకు దయ్యాన్ని చూపిస్తా’ అని సవిత బెదిరించింది” అని కుసుమ వెల్లడించింది.