
- అధిక జనాభే ఆర్థిక వనరు.. పెట్టుబడి
- రాబోయే రోజుల్లో లోక్‌సభ సీట్లు పెరుగుతాయంటున్నారు..
- తక్కువ జనాభా వల్ల దక్షిణాదికి సీట్లు తగ్గుతాయన్న ఆందోళన ఉందని వ్యాఖ్య
అమరావతి: జనాభా పెరుగుదలే అతిపెద్ద ఆస్తి అని, దేశంలో జనాభా పెరుగుదలకు అందరూ కృషి చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం వెలగపూడిలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనాభా నియంత్రణ వల్లే చైనా నష్టపోయిందని, ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశాలకే ఎక్కువ గౌరవం దక్కుతున్నదని చెప్పారు.
మితిమీరిన జనాభా నియంత్రణ వల్ల మన దేశం కూడా చాలా నష్టపోయిందన్నారు. రాబోయే రోజుల్లో లోక్‌సభ సీట్లు పెరుగుతాయని అంటున్నారని, తక్కువ జనాభా వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గుతాయన్న ఆందోళన ఉన్నదన్నారు. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టం తెచ్చానని, ఈరోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి) రేటు 1.62 మాత్రమేనని, కానీ 2.1 ఫెర్టిలిటీ రేటు ఉంటేనే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుందన్నారు. లేనిపక్షంలో రోజురోజుకూ జనాభా తగ్గిపోతుందని తెలిపారు. ఫెర్టిలిటీ రేటు బిహార్ లో 3.0, మేఘాలయ 2.9 ఉందని, కానీ ఏపీలో అది 1.7 మాత్రమేనని చెప్పారు. అది ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ మంది పిల్లలుంటే పలు దేశాల్లో ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్నారు.
ఫ్రాన్స్‌లో చైల్డ్ అలవెన్స్ కింద ప్రత్యేక ప్యాకేజీలు, హంగేరీలో పెద్ద కుటుంబాలకు కార్లు బహుమతిగా ఇస్తున్నట్టు చెప్పారు. చైనాలో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ఇండియా జనాభాలో 50 శాతం మహిళలే ఉన్నారని, వాళ్లు ఇంటికే పరిమితమైతే ఆర్థికంగా పైకి రాలేమని చెప్పారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ చేశామని, ఇప్పుడు జనాభా నిర్వహణ చేపట్టాలని అన్నారు. మొన్నటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పని చేశామని, ఇక పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం పని చేయాలన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కోసం పాలసీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.