
అరుణాచలంలో దారుణం జరిగింది. అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ (32) అనే భక్తుడు గిరిప్రదక్షిణం చేసేందుకు అరుణాచలం వెళ్లాడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టారు. ప్రశ్నించిన విద్యాసాగర్‌పై యువకులు కత్తితో దాడి చేసి పారిపోయారు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యాసాగర్ ను వెంటనే తోటి భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగ్‌లను పరిశీలించిన పోలీసులు విచారణలో, తిరువణ్ణామలైకి చెందిన కుగణేశ్వరన్ (21), తమిళరసన్ (25) విద్యాసాగర్ నుండి డబ్బును లాక్కొని పారిపోయారని తేలింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.