హైదరాబాద్ కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నాలాలు, చెరువులు, కుంటలు, పబ్లిక్ పార్కుల కబ్జాలపై కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటోంది. శుక్రవారం (జులై 11) కూకట్ పల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 

 కూకట్ పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హబీబ్ నగర్ లో నాలా ఆక్రమించారనే ఫిర్యాదుతో ఉదయం హైడ్రా అధికారులు నాలాను పరిశీలించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఆక్రమణను తొలగించారు. 

హబీబ్ నగర్ నాలా  మొత్తం 7 మీటర్ల ఉన్నట్లుగా అధికారుల గుర్తించారు. నాలా ఆక్రమించి నిర్మించిన ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ గోడ, ఎన్.కే.ఎన్.ఆర్ గార్డెన్ ప్రహరీ గోడ, మరో ప్రహరీ గోడలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. నాలాలోని చెత్త, వ్యర్థాలు తొలగించారు హైడ్రా సిబ్బంది.

గ్రేటర్ పరిధిలో ఆక్రమణలను తొలగించడంలో హైడ్రా వేగం పెంచింది. ఇటీవలే రాజేంద్రనగర్ లో పార్కు స్థలం కబ్జా చేసి నిర్మించిన ఆక్రమణలను తొలగించింది. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు  ఫిర్యాదు చేసింది. స్థానికుల ఫిర్యాదుతో ఉదయం నలందానగర్ కు చేరుకున్న హైడ్రా.. కబ్జాకు గురైన స్థలాన్ని కూల్చివేసింది.

కబ్జాల కూల్చివేతకు ముందు అక్కడ కొంత హైడ్రామా నడిచింది. తమ పట్టా భూముల్లో నిర్మాణం చేసుకున్నామని, కూల్చివేతలు చేపట్టవద్దని పట్టాదారులు వాదనకు దిగారు.  ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని పట్టాదారుల ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీ వాహనాలకు అడ్డంగా పడుకుని ఆందోళనకు దిగారు. మహిళలుహైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

హైదర్ గూడ విలేజ్ సర్వే నంబరు 16 లో 1000 గజాల పార్కు స్థలం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారనని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ ప్రహరీ గోడలు కూల్చివేశారు. కబ్జాలు ఎక్కడఉన్నా.. వాటి వెనుక ఎంతటి నాయకులు ఉన్నా సహించేదిలేదని.. కబ్జాలను కూల్చివేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.