పురపాలక శాఖ అనుమతి లేకుండా ఎట్ల కూల్చుతరు? : హైకోర్టు

పురపాలక శాఖ అనుమతి లేకుండా ఎట్ల కూల్చుతరు? : హైకోర్టు
  • ఆక్రమణలైనా చట్టప్రకారమే తొలగించాలి
  •  ఓ కేసులో హైడ్రాకు తేల్చి చెప్పిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  పురపాలక శాఖ అనుమతి లేకుండా వివాదంలో ఉన్న స్థలం కాంపౌండ్‌‌‌‌ను ఎలా కూల్చుతారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. ఆక్రమణలైనప్పటికీ అనుమతి లేకుండా కూల్చే అధికారం మీకెక్కడిదని ప్రశ్నించింది.

తొలగించాలనుకుంటే నోటీసులు తప్పనిసరని తేల్చి చెప్పింది.  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, నార్సింగ్‌‌‌‌లోని సర్వే నెం.300 నుంచి 303..అలాగే, 306 నుంచి 311... 313 నుంచి 315 వరకు 1608 చదరపు గజాల స్థలంలో ఉన్న పలు ప్లాట్లకు ఉన్న కాంపౌండ్‌‌‌‌ను హైడ్రా కూల్చివేసి కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ గొర్ల రాహుల్‌‌‌‌యాదవ్‌‌‌‌ మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌.వి.శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌ న్యాయవాది ఎ.రవీందర్‌‌‌‌రెడ్డి, న్యాయవాది పి.పంకజ్‌‌‌‌రెడ్డిలు వాదిస్తూ..ఈ స్థలానికి సంబంధించిన పిటిషనర్ల హక్కులను ధ్రువీకరిస్తూ కింది కోర్టు తీర్పు వెలువరించిందన్నారు. దీనిపై అధికారులు అప్పీలు దాఖలు చేశారని, ఇది పెండింగ్‌‌‌‌లో ఉండగా ఏకపక్షంగా తొలగించారన్నారు. హైడ్రా తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ జరిగిందని రాత పూర్వకంగాగాని, మౌఖికంగాగాని ఫిర్యాదు అందితే హైడ్రా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం హైడ్రా పురపాలకశాఖ మార్గదర్శకాలు, అనుమతులతో పనిచేయాల్సి ఉందన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటామంటే చెల్లవని స్పష్టం చేశారు.ఆక్రమణలపై చర్యలు తీసుకునేముందు రెవెన్యూ రికార్డులను ధ్రువీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆక్రమణదారులైనా నోటీసు ఇవ్వడం తప్పనిసరని తేల్చి చెప్పారు. ఈ కేసులో  పిటిషనర్లకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వేసిన కంచెను 48 గంటల్లో తొలగించి అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలంటూ విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు.