హైదరాబాద్ సిటీలోని చెరువుల రక్షణే ధ్యేయంగా హైడ్రా (HYDRA) మరో కీలక అడుగు వేసింది. ఆక్రమణదారులు, కబ్జాదారుల ఆటకట్టించేందుకు అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించింది. నగరవ్యాప్తంగా ఉన్న 264 చెరువుల వద్ద నిరంతర నిఘా కోసం ఏకంగా 900 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది.
ఈ అత్యాధునిక నిఘా వ్యవస్థను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మే 11న ప్రారంభించారు. ఈ కెమెరాలన్నీ హైడ్రా కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌కు అనుసంధానం చేయబడ్డాయి. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటల పాటు చెరువుల పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తారు. ఎవరైనా చెరువుల్లో మట్టి పోసినా లేదా నిర్మాణ వ్యర్థాలు వేసినా.. వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ అందుతుంది.
ముఖ్యంగా రాత్రి సమయాల్లో చెరువులను కబ్జా చేసేందుకు మట్టి పోసే వాహనాల వివరాలను ఈ కెమెరాలు స్పష్టంగా రికార్డు చేస్తాయి. వాహనాల నెంబర్ ప్లేట్లతో సహా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ నిఘా దోహదపడుతుంది. ఈ వ్యవస్థను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) కు కూడా అనుసంధానించడం విశేషం. దీనివల్ల నిఘా మరింత పటిష్టంగా ఉండనుంది.
క్షేత్రస్థాయిలో పనిచేసే లేక్ ప్రొటెక్షన్ టీమ్‌లకు ఈ సీసీటీవీలు ఒక ఆయుధంగా మారనున్నాయి. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు లేదా కబ్జాలు జరుగుతున్నట్లు కెమెరాలో కనిపించగానే.. వెంటనే స్థానిక టీమ్స్ అలర్ట్ అయ్యి అక్కడికి చేరుకుంటాయి. చెరువులను కాపాడటంలో ఎలాంటి రాజీ లేదు.. నిఘా నీడలో ప్రతి అంగుళం ఉంటుంది అని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
